Adani Group: ఏపీలో వరద బాధితులకు రూ.25 కోట్ల భారీ విరాళం అందించిన అదానీ గ్రూప్

Adani group donates huge sum of Rs 25 crore to AP flood relief works
  • ఏపీలో ఇటీవల వరద బీభత్సం
  • సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా విరాళాలు
  • రూ.25 కోట్ల విరాళంతో ముందుకొచ్చిన అదానీ గ్రూప్
సెప్టెంబరు మొదటి వారంలో సంభవించిన వరదలు ఏపీలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. 40 మందికి పైగా మృత్యువాతపడ్డారు. లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. తీవ్రస్థాయిలో ఆస్తి నష్టం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా విరాళాలు అందుతున్నాయి. 

తాజాగా అదానీ గ్రూప్ భారీ విరాళం ప్రకటించింది. వరద బాధితుల సహాయార్థం రూ.25 కోట్లు అందిస్తున్నట్టు అదానీ ఫౌండేషన్ చైర్ పర్సన్ డాక్టర్ ప్రీతి అదానీ ప్రకటించారు. 

ఈ క్రమంలో నేడు ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీ రూ.25 కోట్ల విరాళం తాలూకు పత్రాలు అందించారు. 

దీనిపై చంద్రబాబు స్పందిస్తూ... అదానీ ఫౌండేషన్ చైర్ పర్సన్ ప్రీతి అదానీకి, అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీకి కృతజ్ఞతలు తెలియజేశారు. వరద బీభత్సంతో కుదేలైన రాష్ట్ర ప్రజల జీవితాలను మళ్లీ నిలబెట్టడంలో మీ విరాళం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అంటూ అదానీ గ్రూప్ ను ఉద్దేశించి చంద్రబాబు ట్వీట్ చేశారు.

మంత్రి నారా లోకేశ్ తో కరణ్ అదానీ భేటీ

ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ను అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీ మర్యాదపూర్వకంగా కలిశారు. కరణ్ అదానీ ఇవాళ ఏపీ ప్రభుత్వానికి రూ.25 కోట్ల విరాళం అందించేందుకు వచ్చారు. చంద్రబాబుకు విరాళం తాలూకు పత్రాలు అందించిన అనంతరం ఆయన మంత్రి నారా లోకేశ్ చాంబర్ కు వచ్చారు. 

ఈ సందర్భంగా... వరద బాధితులకు సాయం అందించినందుకు కరణ్ అదానీకి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. అంతేగాకుండా... రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను కరన్ అదానీ కు వివరించారు. దీనిపై కరణ్ అదానీ స్పందిస్తూ, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వడానికి సిద్ధంగా ఉన్నామని లోకేశ్ తో చెప్పారు.
Adani Group
Donation
Floods
Chandrababu
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News