Narendra Modi: కశ్మీర్లో పాకిస్థాన్ అజెండాను అమలు కానివ్వబోం: ప్రధాని మోదీ
- వారసత్వ రాజకీయాలకు ముగింపు పలికేందుకు బీజేపీకి ఓటు వేయాలని పిలుపు
- జమ్ము కశ్మీర్ భవిష్యత్తు కోసం ఎన్నికలు జరుగుతున్నాయన్న ప్రధాని
- వివిధ రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామన్న ప్రధాని
కశ్మీర్లో పాకిస్థాన్ అజెండాను ఎట్టి పరిస్థితుల్లో అమలు కానివ్వబోమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. జమ్ము కశ్మీర్ రెండో విడత ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కాట్రాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మేనిఫెస్టో చూసి పాకిస్థాన్ సంబరాలు చేసుకుంటోందన్నారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ పార్టీల వారసత్వ రాజకీయాలకు ముగింపు పలికేందుకు బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
జమ్ము కశ్మీర్ భవిష్యత్తు కోసమే ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. జమ్ము కశ్మీర్‌పై కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వివక్ష చూపుతూనే ఉందన్నారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్‌లు పాకిస్థాన్‌కు నదీ జలాలు వెళ్లేలా చేస్తే, తాము ఆనకట్ట కట్టామన్నారు. కొన్నేళ్లుగా జమ్మూని ఈ మూడు పార్టీలు విస్మరించాయని ఆరోపించారు. తమ ప్రభుత్వం వివిధ రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు.
ఆర్టికల్ 370 గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత వేర్పాటువాదం, ఉగ్రవాదం తగ్గిందన్నారు. వీటిని పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. కశ్మీర్ యువత ఇప్పుడు రాళ్లకు బదులు, పెన్ను, పేపర్ పట్టుకుంటోందని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370ని ఏ శక్తీ వెనక్కి తీసుకు రాలేదన్నారు. జమ్ము కశ్మీర్‌ను తిరిగి రాష్ట్రంగా మారుస్తామని చెప్పారు. ఈ విషయాన్ని పార్లమెంట్‌లోనే ప్రకటించామని గుర్తు చేశారు.