Danam Nagender: కంగనా రనౌత్‌పై దానం నాగేందర్ తీవ్ర వ్యాఖ్య... మహిళా కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు

BJP complaint against Danam Nagendar over his comments on Kangana
  • కంగనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మహిళా మోర్చా ఫిర్యాదు
  • దానంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
  • దానం వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్
బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీజేపీ మహిళా మోర్చా నేతలు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదను కలిసి వినతిపత్రాన్ని అందించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన దానంపై చర్యలు తీసుకోవాలని కోరారు. సినిమాల్లో భోగం వేషాలు వేసుకునే కంగనాకు రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు లేదని దానం నాగేందర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

దానం వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్

కంగనా రనౌత్‌పై దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఖండించారు. ఆమె పట్ల దానం ఉప‌యోగించిన నీచ‌మైన‌ భాష ఆమోద‌యోగ్యం కాద‌న్నారు. కంగ‌న అభిప్రాయాల‌తో, ఆమె పార్టీ భావజాలంతో తాను ఏకీభవించడం లేదని, కానీ మహిళల పట్ల దిగజారుడు వ్యాఖ్యలు సరికాదన్నారు. 

ఢిల్లీలో, తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు కూడా దానం నాగేంద‌ర్ వ్యాఖ్య‌ల ప‌ట్ల‌ స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దానం వ్యాఖ్య‌ల‌ను వారు సమర్థిస్తున్నారా? అని కేటీఆర్ నిలదీశారు.

సోనియా గాంధీ పట్ల అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కేసీఆర్ ఖండించారని గుర్తు చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి తాము నీతి, మర్యాదకు కట్టుబడి ఉంటామన్నారు. క్రూర‌మైన నేరం... క్రూర‌మైన నేరమే అవుతుందన్నారు. అది రేప్ అయినా... మర్డర్ అయినా... మహిళలను కించపరిచేలా మాట్లాడటం అయినా నేరమే అవుతుందన్నారు. స్త్రీలను గౌరవించడం మర్యాదకు సంబంధించిన అంశం అన్నారు.
Danam Nagender
Congress
BJP
Kangana Ranaut

More Telugu News