India Vs Bangladesh: చెన్నై టెస్ట్... తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ను కుప్పకూల్చిన టీమిండియా
- 149 పరుగులకే ఆలౌట్ అయిన బంగ్లా బ్యాటర్లు
- 4 వికెట్లతో చెలరేగిన జస్ప్రీత్ బుమ్రా
- తలో రెండు వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా
- భారత్‌కు 227 పరుగుల భారీ ఆధిక్యం
చెన్నై వేదికగా భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక జట్టు తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 149 పరుగుల స్వల్ప స్కోరుకే బంగ్లాదేశ్ ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు 227 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లతో చెలరేగాడు. మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లు తీశారు. పటిష్టంగా ఉన్న భారత బౌలింగ్ ధాటికి బంగ్లా బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. 32 పరుగులు చేసిన షకీబ్ అల్ హసన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 27 పరుగులతో మెహదీ హసన్ మిరాజ్ నాటౌట్‌గా నిలిచాడు.
మిగతా బంగ్లాదేశ్ బ్యాటర్లలో షాద్మాన్ ఇస్లామ్ 2, జాకీర్ హసన్ 3, శాంటో 20, మొమీనుల్ 0, ముష్ఫీకర్ రహీమ్ 8, లిట్టన్ దాస్ 22, హసన్ మహ్మద్ 9, టాస్కిన్ అహ్మద్ 11, నహీద్ రానా 11 చొప్పున పరుగులు చేశారు. బంగ్లా తొలి ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం, భారత్ సెకండ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చారు.