India Vs Bangladesh: చెన్నై టెస్ట్‌లో ముగిసిన రెండో రోజు ఆట... భారీ ఆధిక్యంలో భారత్
ఆట ముగిసే సమయానికి సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత్ స్కోరు 81/3
308 పరుగుల భారీ ఆధిక్యంలో టీమిండియా
రెండో ఇన్నింగ్స్‌లోనూ స్వల్ప స్కోర్లకే ఔటైన్ కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ
భారత్-బంగ్లాదేశ్ మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండవ రోజు ఆట పూర్తయింది. ఆట చివరికి భారత్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 81/3 పరుగులుగా ఉంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 227 పరుగులతో కలుపుకొని భారత్ ఆధిక్యం 308 పరుగులకు పెరిగింది.
సెకండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 10, కెప్టెన్ రోహిత్ శర్మ 5, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 17 పరుగులు చొప్పున స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఆట ముగిసే సమయానికి క్రీజులో శుభ్‌మాన్ గిల్ (33 బ్యాటింగ్), రిషబ్ పంత్ (17 బ్యాటింగ్) ఉన్నారు. బంగ్లాదేశ్ బౌలర్లలో నహీద్ రాణా, తస్కిన్ అహ్మద్, హసన్ మిరాజ్ తలో వికెట్ తీశారు.
కాగా రెండవ రోజు ఆటలో ప్రధానాంశాల విషయానికి వస్తే... ఓవర్ నైట్ స్కోర్ 339/6 వద్ద బ్యాటింగ్ ఆరంభించిన భారత్ మరో 37 పరుగులు మాత్రమే జోడించి 376 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ కేవలం 149 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా తలో రెండేసి వికెట్లు తీశారు.
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ 113 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రవీంద్ర జడేజా 86, యశస్వి జైస్వాల్ 56 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. మిగతా బ్యాటర్లలో పంత్ 36, రోహిత్ శర్మ 6, విరాట్ కోహ్లీ 6, శుభ్‌మన్ గిల్ 0, కేఎల్ రాహుల్ 16 స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ 5 వికెట్లు, తస్కిన్ అహ్మద్ 3, నహీద్ రాణా, మెహదీ హసన్ చెరో వికెట్ పడగొట్టారు.