Junior NTR: 'దేవర' టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి!
- 'దేవర'గా వస్తున్న ఎన్టీఆర్
- ఆసక్తిని రేపుతున్న ద్విపాత్రాభినయం
- టిక్కెట్ల రేటు పెంచడానికి అనుమతించిన ఏపీ ప్రభుత్వం
- అదనపు షోలకు లభించిన అనుమతి
ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన 'దేవర' సినిమా, ఈ నెల 27వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఆ రోజు కోసం ఎన్టీఆర్ అభిమానులంతా వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి టిక్కెట్ల రేటు పెంచడానికి .. ఆ రోజున 6 షోలు ప్రదర్శించడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది.
మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్ పై రూ.135 వరకూ, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్ పై రూ.110, లోయర్ క్లాస్ ఒక్కో టికెట్ పై రూ.60 వరకూ పెంచుకోవడానికి అనుమతిని ఇచ్చింది. రిలీజ్ రోజున (సెప్టెంబర్ 27) 12 ఏఎమ్ నుంచి మొత్తం 6 షోలకి, 28వ తేదీ నుంచి 9 రోజులపాటు రోజుకు 5 షోల ప్రదర్శనకు అనుమతి లభించింది. ఎన్టీఆర్ అభిమానులకు ఇది కచ్చితంగా శుభవార్తేనని చెప్పాలి.
ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయడం .. ఆయన జోడీగా జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం .. ఇప్పటికే అనిరుధ్ బాణీలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమా, ఓపెనింగ్ రోజు నుంచే కొత్త రికార్డులను సెట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చూడాలి మరి.