Rahul Gandhi: రాహుల్ గాంధీపై కర్ణాటకలో ఎఫ్ఐఆర్ నమోదు

Karnataka BJP files FIR against Rahul Gandhi

  • ఎఫ్ఐఆర్ నమోదు చేసిన బెంగళూరులోని హైగ్రౌండ్ పోలీసులు
  • రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఆందోళన కలిగించాయన్న అమిత్ మాలవీయ
  • రిజర్వేషన్లు తొలగించే కుట్రలో రాహుల్ గాంధీ ఎన్నటికీ విజయం సాధించలేరన్న అమిత్

లోక్ సభలో ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై కర్ణాటకలో ఎఫ్ఐఆర్ నమోదైంది. కొన్ని వర్గాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు రిజర్వేషన్లను తొలగిస్తామని వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనపై ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. అమెరికా పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో కర్ణాటక బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బెంగళూరులోని హైగ్రౌండ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగించాయని, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైందని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. బీజేపీ ఉండగా... ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు తొలగించే కుట్రలో రాహుల్ గాంధీ ఎన్నటికీ విజయం సాధించలేరని పేర్కొన్నారు.

అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... కొన్ని అంశాలపై భారత్‌లో ఘర్షణలు జరుగుతున్నాయన్నారు. ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్నారు. 

దేశంలో ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీల జనాభా 90 శాతం ఉందని, కానీ దేశంలోని మొదటి 200 వ్యాపారుల్లో, అత్యున్నత న్యాయస్థానాల్లో, మీడియాలో వీరి భాగస్వామ్యం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంలో 78 మంది కార్యదర్శులు ఉంటే వీరిలో ఒకే ఒక్క గిరిజనుడు, ముగ్గురు దళితులు, ముగ్గురు ఓబీసీలు, ఒక్క మైనార్టీ మాత్రమే ఉన్నారని రాహుల్ గాంధీ తెలిపారు. 

కులగణన ద్వారానే దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల స్థితిగతులు తెలుస్తాయన్నారు. అందరికీ సమానమైన అవకాశాలు ఉన్నప్పుడు రిజర్వేషన్లు రద్దు చేయడం గురించి ఆలోచిస్తామని రాహుల్ వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు భారత్‌లో అందరికీ సమాన అవకాశాలు లేవన్నారు.

  • Loading...

More Telugu News