Vijaya Chamundeswari: ఏఎన్ఆర్ పెంపకంపై సావిత్రి కూతురు ఆసక్తికర వ్యాఖ్యలు
- ఏఎన్ఆర్ 100 ఫిలిం ఫెస్టివల్ కు హాజరైన సావిత్రి కూతురు
- తనను కూడా అక్కినేని ఫ్యామిలీలో ఒకరిగా గుర్తించారంటూ సంతోషం
- ఏఎన్నార్ ఫ్యామిలీ ప్రేమ, ఆప్యాయత మాటల్లో వర్ణించలేనని వెల్లడి
సావిత్రి చనిపోయి చాలా కాలమైంది. ఇక, సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి గురించి 'మహానటి' సినిమా సమయంలోనే ఎక్కువగా తెలిసింది. 'సావిత్రి క్లాసిక్స్' పేరుతో ఆమె ఒక పుస్తకం ఇటీవల ఆవిష్కరణ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి ఏఎన్ఆర్-100 ఫిలిం ఫెస్టివల్ సెలబ్రేషన్ లో పాల్గొని అక్కినేని నాగేశ్వరరావు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఏఎన్ఆర్ మావయ్య గురించి చెప్పాలంటే ఆయన డిసిప్లిన్, టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహించి పైకి తీసుకురావడం అందరికీ తెలుసు. ఇప్పుడాయన కుటుంబ సభ్యులు కూడా ఈ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరిని ఎదురెళ్లి స్వాగతించి తీసుకువచ్చారు. అది వారి సంస్కారం. దాన్ని బట్టి ఆయన పెంపకం ఎలా ఉంటుందనేది చెప్పవచ్చు" అని విజయ చాముండేశ్వరి వివరించారు.
"అయినా మావయ్య గారు గురించి నేను చెప్పేది ఏమీ లేదు. ఆయన గురించి చెప్పడానికి చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా సుశీల (అక్కినేని కుమార్తె ) నాతో చెబుతూ ఉండేది, మావయ్య 100 ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది అప్పటికి నువ్వు ఇక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకోమని చెప్పింది. ఆరోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూశాను. ఆవిడ అన్నట్టుగానే నిజంగా నేను ఈరోజు ఇక్కడ మీ అందరి ముందు నిలబడి మాట్లాడుతున్నాను అందుకు సంతోషంగా ఉంది" అని చాముండేశ్వరి వివరించారు.