Theft: తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు.. హైదారాబాద్ లో భారీ చోరీ

Massive Theft in Medchal District

  • ఐటీ కారిడార్ లోని ఓ ఇంట్లో చొరబడి నోట్ల కట్టలు ఎత్తుకెళ్లిన దొంగలు
  • భూమి అమ్మగా వచ్చిన సొమ్మును ఇంట్లో దాచిన రియల్టర్
  • నగదుతో పాటు 28 తులాల బంగారం గాయబ్

హైదరాబాద్ శివారులోని ఐటీ కారిడార్ లో భారీ చోరీ జరిగింది. భూమి అమ్మగా వచ్చిన రూ.2 కోట్ల నగదు ఇంట్లో దాయగా.. దొంగలు పడి నోట్ల కట్టలను ఎత్తుకెళ్లారు. నోట్ల కట్టలతో పాటు బీరువాలో దాచుకున్న 28 తులాల బంగారు ఆభరణాలు కూడా మాయం చేశారు. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఐటీ కారిడార్ లోని మక్త గ్రామంలో నాగభూషణం అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇటీవల శంకర్ పల్లిలో తనకున్న 10 ఎకరాల భూమిని నాగభూషణం అమ్మకానికి పెట్టాడు. మంచి ధర రావడంతో అమ్మకానికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాడు. 

ఇందులో భాగంగా రూ.2 కోట్ల 2 లక్షలు అడ్వాన్స్ గా తీసుకున్నాడు. ఈ సొమ్మును నాగభూషణం ఇంట్లోనే దాచాడు. ఈ విషయం ఎలా తెలిసిందో ఏమో కానీ శనివారం రాత్రి దొంగలు పడి ఆ సొమ్మంతా ఎత్తుకెళ్లారు. ఇంటి తాళాలు, బీరువా తాళాలు పగలగొట్టి డబ్బు, నగలు పట్టుకెళ్లారని బాధితుడు నాగభూషణం కన్నీటిపర్యంతమయ్యాడు. నాగభూషణం ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దొంగతనం జరిగిన తీరును పరిశీలించి, పరారైన దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానంతో నాగభూషణం డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News