Iran: ఇరాన్ బొగ్గు గనిలో పేలుడు.. 30 మంది కార్మికులు దుర్మరణం

At least 30 dead in coal mine explosion in Iran state media says
  • మీథేన్ గ్యాస్ లీక్ కారణంగా పేలుడు
  • 17 మంది కార్మికులకు తీవ్ర గాయాలు
  • మరికొంత మంది కార్మికులు లోపల చిక్కుకుపోయినట్లు సమాచారం
ఇరాన్ లోని ఓ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. శనివారం అర్ధరాత్రి ప్రాంతంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. దీంతో లోపల పనిచేస్తున్న కార్మికులలో 30 మంది చనిపోయారు. మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం విషయం తెలిసి హుటాహుటిన అక్కడికి చేరుకున్న అధికారులు.. గాయపడ్డ కార్మికులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. బొగ్గు గని టన్నెల్ లో కార్మికులు పనిచేస్తుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించిందని సమాచారం. మీథేన్ గ్యాస్ లీక్ కావడమే పేలుడుకు దారి తీసిందని గాయపడ్డ కార్మికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో గనిలో పెద్ద సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు.

మరికొంతమంది కార్మికులు లోపల చిక్కుకుపోయారని అనుమానం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, లోపల చిక్కుకున్న కార్మికులను క్షేమంగా బయటకు తీసుకొస్తామని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన బొగ్గు గని ఇరాన్ రాజధానికి సుమారు 540 కిలోమీటర్ల దూరంలోని తబాస్ లో ఉంది. కాగా, ఇరాన్ లో గతంలోనూ బొగ్గు గని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 2017లో ఓ బొగ్గు గనిలో జరిగిన పేలుడుకు 42 మంది కార్మికులు బలయ్యారు. 2013లో రెండు గనులలో జరిగిన ప్రమాదాలలో 11 మంది, 2009లో జరిగిన మరో ప్రమాదంలో 20 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
Iran
coal mine
Blast
30 dead

More Telugu News