HYDRA: 15 రోజుల తర్వాత మళ్లీ వస్తాం... నల్ల చెరువు ఆక్రమణదారులకు హైడ్రా నోటీసులు

Hydra Demolitions At Nalla Cheruvu In Kukatpally

  • నివాస సముదాయాలకు గడువు ఇచ్చిన హైడ్రా
  • ఆదివారం 16 షెడ్లను కూల్చివేసిన అధికారులు
  • నల్ల చెరువులో 14 ఎకరాల మేర కబ్జా జరిగినట్లు గుర్తింపు

కూకట్ పల్లిలోని నల్ల చెరువును ఆక్రమించి ఇళ్లు కట్టుకున్న వారికి హైడ్రా అధికారులు 15 రోజుల గడువుతో నోటీసులు జారీ చేశారు. గడువు ముగిసేలోగా ఖాళీ చేసి వెళ్లాలని, ఆ తర్వాత ఇళ్లను కూల్చివేస్తామని స్పష్టం చేశారు. 

ఆదివారం నాడు నల్ల చెరువులోని ఆక్రమణలను హైడ్రా తొలగించిన విషయం తెలిసిందే. అక్కడున్న వ్యాపార సముదాయాలను శనివారం ఖాళీ చేయించిన అధికారులు... ఆదివారం ఉదయం నుంచే బుల్డోజర్లతో తొలగింపు చేపట్టారు. మొత్తం 16 షెడ్లను నేలమట్టం చేశారు. నివాస సముదాయాల కూల్చివేతను తాత్కాలికంగా ఆపారు.

అక్కడ ఉంటున్న వారికి 15 రోజులు గడువు ఇచ్చారు. ఆలోగా ఆక్రమణలను తొలగించాలని చెప్పారు. గడువు ముగిసినా అలాగే ఉంటే మాత్రం తామే కూల్చివేస్తామని తేల్చిచెప్పారు. 

నల్ల చెరువు మెుత్తం విస్తీర్ణం 27 ఎకరాలు కాగా, 14 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. శుక్రవారం సర్వే నిర్వహించిన హైడ్రా అధికారులు శనివారం రాత్రి షెడ్లలో నివాసితులను ఖాళీ చేయించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే జేసీబీ, బుల్డోజర్లతో భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు.

బాధితుల కన్నీళ్లు...


కూకట్ పల్లి నల్ల చెరువు ఆక్రమణల తొలగింపు సందర్భంగా బాధితులు కంటతడి పెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తమకు కనీసం నోటీసు కూడా ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారని హైడ్రా అధికారులపై బాధితులు మండిపడుతున్నారు. ఇంట్లోని విలువైన సామాన్లు కూడా తీసుకోనివ్వలేదని, పోలీసులతో తమను అడ్డుకున్నారని వాపోయారు. 

సంవత్సరాల తరబడి నివాసం ఉన్న షెడ్లను కళ్ల ముందే కూల్చేస్తుంటే బాధితులు కన్నీరు పెట్టడం చూపరులను కలచివేసింది. రెక్కల కష్టంతో తినీతినకా పొదుపు చేసిన సొమ్ముతో ఓ గూడు ఏర్పరుచుకున్నామని, ఇప్పుడు అధికారులు దానిని కూల్చేస్తున్నారని బాధితులు రోదిస్తూనే మీడియాతో చెప్పారు.

  • Loading...

More Telugu News