R.Krishnaiah: వైసీపీకి ఆర్ కృష్ణయ్య గుడ్‌బై.. త్వరలో బీజేపీలో చేరిక?
- తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నినాదం ఎత్తుకున్న బీజేపీ
- ఈ విషయంలో మరింతగా ముందుకెళ్లాలని భావిస్తున్న కాషాయ పార్టీ
- ఆర్ కృష్ణయ్యతో బీజేపీ జాతీయ నేత చర్చలు!
- కీలక పదవి ఇచ్చేందుకు పార్టీ పెద్దల రెడీ!
అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాభవం మూటగట్టుకున్న వైఎస్సార్ సీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల పలువురు కీలక నేతలు పార్టీని వీడారు. మరికొందరు అదే దారిలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ రాజ్య సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య త్వరలోనే పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నినాదాన్ని ఎత్తుకున్న బీజేపీ ఈ విషయంలో మరింతగా ముందుకెళ్లాలని భావిస్తోంది. అందులో భాగంగా బీసీల్లో పట్టున్న సీనియర్ నేత ఆర్ కృష్ణయ్యను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఓటు బ్యాంకును పెంచుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా కృష్ణయ్యతో జరిపిన చర్చలు ఫలించినట్టు తెలిసింది.
పార్టీ జాతీయ అగ్రనేత జరిపిన ఈ చర్చలు ఫలవంతమైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో ఆయనకు కీలక పదవి ఇవ్వనున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఆర్ కృష్ణయ్య దాదాపు పదేళ్లపాటు ఆరెస్సెస్, ఏబీవీపీలో పనిచేసిన నేపథ్యంలో ఆ సంస్థ ముఖ్యులతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నెల 13న కృష్ణయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా జన్మదిన శుభాకాంక్షలు తెలపడం ఆయన పార్టీలో చేరబోతున్నారన్న వార్తలకు బలం చేకూరుస్తోంది.