Tirumala Laddu: తిరుమల కల్తీ లడ్డూపై సిట్ కు ఆదేశించిన ప్రభుత్వం?
- సిట్ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు
- ఈ సాయంత్రానికి సిట్ కు సంబంధించి జీవో విడుదలయ్యే అవకాశం
- దర్యాప్తు అధికారిగా ఎవరిని నియమించాలనే దానిపై ప్రభుత్వ కసరత్తు
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. లడ్డూ కల్తీపై సిట్ దర్యాప్తుకు కూటమి ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. దర్యాప్తు అధికారిగా ఎవరిని నియమించాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రానికి దర్యాప్తు అధికారి పేరు, విధివిధానాలతో జీవోను విడుదల చేసే అవకాశం ఉంది.
తిరుమల లడ్డూ కల్తీపై సిట్ ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. నిన్న మంత్రులతో కలిసి ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పేనని ఆయన అన్నారు. తిరుమలలో మహా అపచారానికి పాల్పడ్డారని చెప్పారు. టీటీడీని వ్యాపార సంస్థగా, రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని మండిపడ్డారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నెయ్యి, ఇతర సరకుల సరఫరాకు సంబంధించి రివర్స్ టెండర్ల పేరుతో నిబంధనలు మార్చారని చంద్రబాబు మండిపడ్డారు. నిబంధనల ప్రకారం డెయిరీకి ఉండాల్సిన మూడేళ్ల కనీస అనుభవాన్ని ఏడాదికి తగ్గించారని విమర్శించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ఇష్టానుసారం వ్యవహరించారని దుయ్యబట్టారు.
అనుభవం లేని వారికి కాంట్రాక్ట్ ఇవ్వడంతో... వారు నాసిరకం నెయ్యిని సరఫరా చేశారని ముఖ్యమంత్రి చెప్పారు. స్వామివారి పవిత్రమైన లడ్డూలో పంది కొవ్వు కలిసిందని తెలిసి ఎంతో మంది బాధపడ్డారని చెప్పారు. కల్తీ నెయ్యితో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.