Anam Ramanarayana Reddy: తిరుమల లడ్డూ వివాదంపై మరోసారి స్పందించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం
- ఏడాది కూడా అనుభవం లేని కంపెనీకి నెయ్యి సప్లయి కాంట్రాక్ట్ ఇచ్చారన్న మంత్రి
- గత పాలకులు నెయ్యిని కల్తీ చేసి దోపిడీకి పాల్పడ్డారని మండిపాటు
- సీఎం చంద్రబాబు ఆదేశాలతో నెయ్యిని పరీక్షించామని వెల్లడి
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందనే వివాదం నేపథ్యంలో కూటమి పార్టీల నేతలు - విపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ వివాదంపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తాజాగా మరోసారి స్పందించారు. నెయ్యి సప్లయి చేసే కంపెనీలకు కనీసం మూడేళ్ల అనుభవం కావాల్సి ఉండగా.. కనీసం ఏడాది కూడా అనుభవంలేని కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చారని అన్నారు. ఇంత అపచారం జరిగితే అసలు ఏమీ తెలియనట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జగన్ లేఖ రాశారని మండిపడ్డారు. ఆత్మకూరు పట్టణంలోని పేరారెడ్డిపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన ‘‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలతో పరీక్షలు నిర్వహించామని, జంతు కొవ్వు ఉందని రిపోర్టుల ద్వారా నిర్ధారణ అయిందని మంత్రి చెప్పారు. స్వామివారి ప్రసాదమైన లడ్డూలో కల్తీ నెయ్యి వాడి గత ప్రభుత్వ పాలకులు దోపిడీ చేశారని ఆయన ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి సీఎం కావడం కోసం సొంత బాబాయినే హత్య చేశారని, ఇక తిరుమలను దోచుకోమని మరొక బాబాయిని పంపించారని ఆయన తీవ్రంగా విమర్శించారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను జగన్ దెబ్బతీశారని విరుచుకుపడ్డారు. జగన్ ఒక మోసగాడని, ఒక బ్లాక్ మెయిలర్ అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అనేక కార్యక్రమాలను ఆచరణలోకి తీసుకొచ్చామని ఆయన ప్రస్తావించారు.