Nara Lokesh: యూనివర్సిటీల నుంచి బయటకొచ్చే ప్రతి విద్యార్థికి ఉద్యోగం రావాలి: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh reviews on Education and Skill Development depts
  • విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖలపై మంత్రి లోకేశ్ సమీక్ష
  • వర్సిటీల ప్రమాణాలు పెంచాలని సూచన
  • ప్రతి వర్సిటీకి లక్ష్యాలను నిర్దేశించాలని స్పష్టీకరణ
  • జాబ్ క్యాలెండర్ సిద్ధం చేయాలని ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ లోని యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల నుంచి చదువు పూర్తి చేసుకొని బయటకు వచ్చేసరికి ప్రతి విద్యార్థికి ఉద్యోగం సిద్ధంగా ఉండాలని, ఇందుకు తగ్గట్లుగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి కరిక్యులమ్ లో మార్పులు చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. 

రాష్ట్ర ఉన్నత విద్యశాఖ అధికారులతో మంత్రి లోకేశ్ నేడు ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులు ఆయా కళాశాలల్లో చదువుకునేటప్పుడే ప్రస్తుత మార్కెట్ ట్రెండ్స్ కు అనుగుణంగా స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలని, బయట మళ్లీ శిక్షణ తీసుకునే పరిస్థితులు ఉండకూడదని స్పష్టంచేశారు. కంప్యూటర్ సైన్స్, మెకానికల్ వంటి వాటితోపాటు సివిల్స్ శిక్షణ కూడా అంతర్భాగం చేసే అంశాన్ని పరిశీలించాలని అన్నారు. 

ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో రాష్ట్రానికి చెందిన యూనివర్సిటీలు వెనుకబడి ఉండటంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ర్యాంకింగ్స్ మెరుగుదలకు విద్యారంగ నిపుణుల సలహాలు తీసుకోవాలని అన్నారు. 2027నాటికి మెరుగైన ర్యాంకింగ్ కోసం ప్రతి యూనివర్సిటీకి లక్ష్యాన్ని నిర్దేశించాలని, ఆంధ్రా, ఆచార్య నాగార్జున వర్సిటీ టాప్-10లో ఉండాలని అన్నారు. 2030, 2047 నాటికి యూనివర్సిటీల్లో ప్రమాణాల మెరుగుకు లక్ష్యాలను నిర్దేశించాలని అన్నారు. 

రాష్ట్రంలో చదువుకున్న ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా అపార్ ఐడీ ఏర్పాటుచేసి డిజి లాకర్ ఇవ్వాలని తెలిపారు. డిజి లాకర్ సమాచారాన్ని డ్యాష్ బోర్టుకు అనుసంధానం చేయాలని సూచించారు. ఇటీవల వరదల్లో సర్టిఫికెట్లు కోల్పోయిన విద్యార్థులకు తక్షణం జారీచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో సర్టిఫికెట్ల కోసం యూనివర్సిటీలకు వెళ్లకుండా పూర్తిస్థాయిలో డిజి లాకర్స్ సిద్ధం చేయాలని అన్నారు. 

ఏపీపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలనకు ఎక్కువ సమయం పడుతోందని, రాబోయే రోజుల్లో డిజి లాకర్స్ ను ఎఐతో అనుసంధానించడం ద్వారా సులభంగా సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయవచ్చని చెప్పారు.

మంత్రి నారా లోకేశ్ నేడు నైపుణ్యాభివృద్ధి శాఖపై కూడా సమీక్ష నిర్వహించారు. రేపు సంబంధిత శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష ఉన్నందున ఉండవల్లిలోని నివాసంలో ముందస్తుగా సన్నాహక సమావేశం నిర్వహించారు. 

ఈ సమావేశంలో నైపుణ్యాభివృద్ధి శాఖ చేపడుతున్న అనేక కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు. స్కిల్ సెన్సెస్ యాప్ పై పైలెట్ ప్రాజెక్టు కింద మంగళగిరి, సీఆర్డీయే ప్రాంతాల్లో నైపుణ్య గణన చేపట్టాలని ఆదేశించారు. 

పరిశ్రమలతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల అనుసంధాన ప్రక్రియ ఎంతవరకు వచ్చిందన్న అంశంపై సమావేశంలో చర్చించారు. ఐటీఐ కాలేజీల్లో ఉద్యోగాల కల్పన, శిక్షణపైనా చర్చించారు. నియోజకవర్గాల వారీగా ప్రతి నెలా జాబ్ మేళా నిర్వహణకై క్యాలెండర్ రూపొందించాలని ఆదేశాలు జారీ చేసారు.
Nara Lokesh
Review
Education
Skill Development
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News