Pushpa-2: పుష్ప-2కు, జానీ మాస్టర్‌ వివాదానికి సంబంధం లేదు!

Pushpa2 has nothing to do with the Johnny Master controversy
  • పుష్ప-2 రెండు పాటలకు ఆమె అడిషనల్‌ కొరియోగ్రాఫర్‌  
  • జానీ మాస్టర్‌ కూడా ఒక పాట చేయాలన్న నిర్మాత రవిశంకర్‌  
  • ఈ వివాదం పూర్తిగా జానీ మాస్టర్‌ వ్యక్తిగత సమస్యన్న నిర్మాత  
గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌ను కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ వివాదం కుదిపేస్తోంది. తనను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ ఆయన అసిస్టెంట్‌ ఇటీవల ఆరోపిస్తూ పోలీసులకు కంప్లైంట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే జానీ మాస్టర్‌ అసిస్టెంట్‌కు అల్లు అర్జున్‌ అండగా వుండి.. ఆమెకు సినిమాల్లో కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇచ్చాడని, దీంతో పాటు భవిష్యత్‌లో గీతా ఆర్ట్స్‌లో సినిమాలు చేసే అవకాశం కూడా ఇవ్వనున్నాడని గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ఓ వార్త ప్రచారంలో వుంది. 

ఈ విషయంపై సోమవారం 'మత్తు వదలరా-2' ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న  పుష్ప-2 నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్‌ కు ప్రశ్న ఎదురైంది. 'జానీమాస్టర్‌ ఇష్యూలో అల్లు అర్జున్‌, దర్శకుడు సుకుమార్‌ పేర్లు వినిపిస్తున్నాయి. మీరు ఆ సినిమా నిర్మాతల్లో ఒకరు కాబట్టి దీనిపై సమాధానం ఇవ్వగలరా?' అని ప్రశ్నించగా, 'మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా ఏదీ కూడా ఇలాంటి న్యూస్‌లు టెలికాస్ట్‌ చేయడం లేదు. కేవలం సెన్సేషన్ కోసం ప్రయత్నించే కొన్ని కొత్త యూట్యూబ్‌ ఛానెల్స్‌లో ఇలాంటి వార్తలు క్రియేట్‌ చేస్తున్నారు. ఇది పూర్తిగా జానీ మాస్టర్‌ పర్సనల్‌ విషయం. పుష్ప-2 సినిమా ప్రారంభంలోనే జానీ మాస్టర్‌ అసిస్టెంట్‌ను అదనపు కొరియోగ్రాఫర్‌గా తీసుకున్నాం. 

ఆమె సినిమాలోని అన్ని పాటలకు అడిషనల్‌ కొరియోగ్రాఫర్‌గా వుంటారు. మెయిన్‌ కొరియోగ్రాఫర్స్‌ వేరే వాళ్లు వుంటారు. ఇప్పటి వరకు మా చిత్రం నుండి విడుదల చేసిన రెండు పాటల్లో కూడా ఆమె పేరు వుంటుంది. ఇక సినిమాలో వున్న ఓ స్పెషల్‌ సాంగ్‌కు జానీ మాస్టర్‌ వర్క్‌ చేయాలి. ఇంతలోనే ఈ సంఘటన జరిగింది. ఇదే వాస్తవం. కొన్ని సెక్షన్‌ ల మీడియా మాత్రమే సెన్సేషన్ కోసం ఇలాంటి న్యూస్‌లను క్రియేట్‌ చేస్తోంది. అంతే తప్ప పుష్ప-2కు, జానీ మాస్టర్‌ వివాదానికి ఎటువంటి సంబంధం లేదు' అని రవిశంకర్‌ చెప్పారు.
Pushpa-2
johnny master case
Ravi shankar
Pushpa2 update
Johnny master
Pushpa2 release date

More Telugu News