International Law School: కర్నూలులో హైకోర్టు బెంచ్.. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల
- సచివాలయంలో న్యాయశాఖపై చంద్రబాబు సమీక్ష
- వంద ఎకరాల్లో ఇంటర్నేషనల్ లా కాలేజీ ఏర్పాటుపై సూచన
- జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ. 10 వేల గౌరవ వేతనం
- నేరానికి పాల్పడితే శిక్ష తప్పదన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలన్న సీఎం
- అనవసరంగా కోర్టులకు వెళ్లొద్దని సూచన
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. అలాగే, రాజధాని అమరావతిలో 100 ఎకరాల్లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా అంతర్జాతీయ న్యాయ కళాశాల ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో నిన్న న్యాయశాఖపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు చంద్రబాబు పేర్కొన్నారు. జూనియర్ న్యాయవాదులు నిలదొక్కుకునేందుకు నెలకు రూ. 10 వేల చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని, వారికి శిక్షణ కోసం అకాడమీ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు.
అలాగే, దర్యాప్తులను వేగవంతం చేయడం, శిక్షల శాతాన్ని పెంచడం కోసం అధునాతన పద్ధతులు పాటించాలని అధికారులకు సూచించారు. నేరానికి పాల్పడితే శిక్ష తప్పదన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను రక్షించడానికి మాత్రమే కోర్టును ఆశ్రయించాలని, ఈ విషయంలో అనవసర వివాదాల జోలికి పోవద్దని చంద్రబాబు సూచించారు.