AP TET: ఒకే రోజు ఒకే సమయంలో రెండు పరీక్షలు.. ఏపీ టెట్ అభ్యర్థుల్లో అయోమయం

AP TET two exams at same time applicants in shock
  • వచ్చే నెల 3 నుంచి టెట్
  • వివిధ పేపర్లకు దరఖాస్తు చేసుకున్న వారికి ఒకే రోజు ఒకే సమయంలో వేర్వేరు చోట్ల పరీక్షలు
  • ఏది వదులుకోవాలో తేల్చుకోలేకపోతున్న అభ్యర్థులు
  • తమ వద్దకు వస్తే పరిష్కరిస్తామంటున్న డీఈవో
డీఎస్సీకి సిద్ధమవుతున్న ఏపీ అభ్యర్థులను అధికారులు గందరగోళంలో పడేశారు. ఒకే రోజు ఒకే సమయంలో రెండు పరీక్షలకు హాజరు కావాలంటూ హాల్‌టికెట్లు జారీచేశారు. దీంతో ఏం చేయాలో వారికి పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఇటీవల మెగా డీఎస్సీ ప్రకటించింది. అందులో భాగంగా వచ్చే నెల 3 నుంచి ‘టెట్’ నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది దీనికి దరఖాస్తు చేసుకోగా, అధికారులు ఇటీవలే ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు విడుదల చేశారు. వాటిని డౌన్‌లోడ్ చేసుకున్న అభ్యర్థులకు నోట మాట రాకుండా పోయింది.

వేర్వేరు పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రెండు పరీక్షలను ఒకే రోజు ఒకే సమయంలో రెండు పరీక్షలు ఉన్నట్టుగా హాల్ టికెట్లలో ఉండడం చూసి అయోమయానికి గురయ్యారు. ఏలూరుకు చెందిన ఓ అభ్యర్థి పేపర్-1బీ, పేపర్-1ఏకి దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1బీ అంటే 1 నుంచి 5వ తరగతి వరకు ప్రత్యేక పాఠశాలలు కాగా, పేపర్-1ఏ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలు. 

పేపర్-1బీ పరీక్షను అక్టోబర్ 6న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహిస్తుండగా, పేపర్-1ఏను కూడా అదే రోజు ఉదయం 9.30 నుంచి నిర్వహిస్తున్నట్టుగా అభ్యర్థి హాల్ టికెట్లలో ఉండడంతో ఆమె నివ్వెరపోయారు. ఒక పరీక్షను ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్ సీబీఎస్‌ఈ పాఠశాలలో, రెండో దానిని విజయవాడలోని కానూరు కేంద్రంలో నిర్వహిస్తుండడం గమనార్హం. 

దీంతో ఏ పరీక్షను వదులుకోవాలో ఆ అభ్యర్థి తేల్చుకోలేకపోతున్నారు. విషయం కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో డీఈవో అబ్రహం వివరణ ఇచ్చారు. ఒకే రోజు ఒకే సమయంలో పరీక్ష ఉన్నట్టు హాల్ టికెట్లు అందుకున్న అభ్యర్థులు తమ వద్దకు వస్తే చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు.
AP TET
Mega DSC
Andhra Pradesh

More Telugu News