Chandrababu: హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ఆర్ధిక సాయంపై చంద్రబాబు ఆదేశాలు
- హజ్ యాత్రకు వెళ్లే వారికి రూ. 1 లక్ష సాయం
- ఇమామ్, మౌజన్ లకు గౌరవ వేతనాలు
- సంక్షేమ పథకాలను పునర్వ్యవస్థీకరించాలని సీఎం ఆదేశం
రాష్ట్రంలోని మైనార్టీ వర్గాలకు అందించే సంక్షేమ పథకాలను పునర్వ్యవస్థీకరించాలని అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు రూ. లక్ష ఆర్థిక సాయాన్ని ఇస్తామన్న హామీని త్వరలోనే అమల్లోకి తీసుకురావాలని చెప్పారు. ఇమామ్ లు, మౌజన్ లకు గౌరవ వేతనం కింద నెలకు రూ. 10 వేలు, రూ. 5 వేలు... మసీదుల నిర్వహణకు రూ. 5 వేలు ఇస్తామన్న హామీ అమలుకు కూడా త్వరలోనే శ్రీకారం చుట్టాలని ఆదేశించారు. గత టీడీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రూపొందించాలని చెప్పారు.
గత టీడీపీ ప్రభుత్వం హయాంలో మంజూరై కొంతమేర నిర్మాణాలు చేపట్టిన షాదీఖానాలు, ఇతర నిర్మాణాలను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కడపలో హజ్ హౌస్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. వక్ఫ్ బోర్డు భూముల సర్వేను రెండేళ్లలో పూర్తి చేయాలని ఆదేశించారు. వక్ఫ్ బోర్డు భూములను అభివృద్ధి చేయాలని... వాటి ద్వారా బోర్డుకు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గుంటూరులో 50 శాతం పూర్తయిన క్రిస్టియన్ భవన్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.