School Girl: ఆరేళ్ల పాపపై అత్యాచార యత్నం.. ఆపై హత్య చేసిన స్కూల్ ప్రిన్సిపాల్

Principal Kills Girl 6 For Resisting Rape Dumps Body In School Compound
  • గుజరాత్ లోని దహోద్ జిల్లాలో దారుణం
  • ఇంటి నుంచి పాపను తన కారులో స్కూలుకు తీసుకెళ్లిన ప్రిన్సిపాల్
  • దారిలో లైంగికంగా వేధింపులకు పాల్పడడంతో పాప అరుపులు
  • గొంతు పిసికి చంపేసి, మృతదేహాన్ని స్కూలు ఆవరణలో పడేసినట్లు విచారణలో వెల్లడి
ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల పాపపై ఆ స్కూలు ప్రిన్సిపాల్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. తన వికృత చేష్టలను అడ్డుకుందనే కోపంతో గొంతుపిసికి చంపేశాడు. ఆపై మృతదేహాన్ని స్కూలు ఆవరణలో పడేసి ఏమీ తెలియనట్టు నటించాడు. పోలీసుల విచారణలో నిజం బయటపడడంతో కటకటాల పాలయ్యాడు. గుజరాత్ లోని దహోద్ జిల్లాలో జరిగిందీ దారుణం.

పోలీసుల వివరాల ప్రకారం.. దహోద్ జిల్లాలోని ఓ స్కూలు ప్రిన్సిపాల్ ఓ చిన్నారిని రోజూ తన కారులో స్కూలుకు తీసుకెళ్లేవాడు. పాప తల్లిదండ్రులతో పరిచయం ఉండడం, అదే స్కూలులో పాప చదువుతుండడంతో నమ్మి పంపించేవాళ్లు. రోజూలాగే గురువారం కూడా పాపను రెడీ చేసి ప్రిన్సిపాల్ తో పంపించింది. అయితే, సాయంత్రం స్కూలు టైమ్ అయిపోయినా పాప ఇంటికి చేరలేదు. ఏం జరిగిందోనని ఆందోళన పడుతూ స్కూలుకు వెళ్లిన పాప తల్లిదండ్రులకు పాప మృతదేహం కనిపించింది. స్కూలు ఆవరణలో అప్పటికే పాప మృతదేహాన్ని గుర్తించిన టీచర్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. స్కూలు టీచర్లను, పాప క్లాస్ మేట్లను విచారించారు. ఆ రోజు అసలు పాప స్కూలుకే రాలేదని వారు చెప్పారు. పాప తల్లి మాత్రం రోజూ లాగే పాపను ప్రిన్సిపాల్ తో పంపించానని చెప్పింది. ప్రిన్సిపాల్ ను ప్రశ్నించగా.. పాపను స్కూలు దగ్గర దింపేసి వేరే పనిమీద వెళ్లిపోయానని చెప్పాడు. అయితే, ప్రిన్సిపాల్ తీరు అనుమానాస్పదంగా కనిపించడం, పాపను చివరిసారిగా చూసింది అతడొక్కడే కావడంతో పోలీసులు అనుమానించి గట్టిగా విచారించారు. దీంతో పాపను తానే హత్య చేసినట్లు ప్రిన్సిపాల్ ఒప్పుకున్నాడు. కారులో స్కూలుకు వస్తుండగా మధ్యలో లైంగికంగా వేధించానని, తన చేష్టలకు పాప అరవడంతో గొంతు పిసికి చంపేశానని చెప్పాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రిన్సిపాల్ ను అరెస్టు చేశారు.
School Girl
Gujarat crime
Murder
Principal
Crime News

More Telugu News