Ravichandran Ashwin: భార‌త క్రికెట్‌కు జస్ప్రీత్ బుమ్రా 'కోహినూర్ వ‌జ్రం': రవిచంద్రన్ అశ్విన్

R Ashwin hails Jasprit Bumrah as Team India Kohinoor diamond

  • భార‌త క్రికెట‌ర్ల‌లో అత్యంత ఫిట్ ప్లేయ‌ర్ తానేన‌న్న‌ జ‌స్ప్రీత్ బుమ్రా
  • బుమ్రా అభిప్రాయంపై నెట్టింట మిశ్ర‌మ స్పంద‌న‌
  • ఫిట్‌నెస్ విష‌యంలో కోహ్లీ కంటే బుమ్రా ఎక్కువేమీ కాదంటూ కొంద‌రి వాద‌న‌
  • బుమ్రాకు మ‌ద్ద‌తుగా ట్రోల‌ర్స్‌కు చుర‌క‌లంటించిన అశ్విన్‌ 

భార‌త క్రికెట‌ర్ల‌లో అత్యంత ఫిట్ ప్లేయ‌ర్ తానేన‌ని పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా చెప్ప‌డం ప‌ట్ల‌ నెట్టింట మిశ్రమ స్పందన వస్తోంది. ఇత‌ర క్రికెట‌ర్ల అభిమానులు అత‌డిపై ట్రోల్ చేస్తున్నారు.  

తాజాగా ఈ విష‌య‌మై రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. భారత క్రికెట్‌కు బుమ్రా ఓ కోహినూర్ వ‌జ్రం అని పేర్కొన్నాడు. భార‌త జ‌ట్టు కిరీటంలో క‌లికితురాయి అని బుమ్రాపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు.  అత‌నిపై విమర్శలు చేసినవారికి అశ్విన్‌ కాస్త చురకలు కూడా అంటించాడు.
 
అసలు ఏం జరిగిందంటే..?
ఇటీవ‌ల ఓ ఇంటర్వ్యూలో బుమ్రా తన ఫిట్నెస్‌పై మాట్లాడాడు. టీమిండియాలో ఎవరు అత్యుత్తమ ఫిట్‌నెస్‌తో ఉంటారు? అని అడిగితే, దానికి బుమ్రా త‌న పేరే చెప్పుకున్నాడు. దానికి కార‌ణం కూడా చెప్పాడు.

"మీరు వెతుకుతున్న సమాధానం నాకు తెలుసు. కానీ నేను ఫాస్ట్ బౌలర్ కాబట్టి నా పేరు చెప్పాలనుకుంటున్నాను" అని బుమ్రా అన్నాడు. అయితే, అంద‌రూ కోహ్లీ పేరు చెబుతాడ‌ని అనుకున్నారు. దీంతో ఫిట్‌నెస్ విషయంలో కోహ్లీ కంటే ఎక్కువ స్థాయిలో ఉంటాడా అని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తాయి. భారత క్రికెట్‌లో ఫిట్‌నెస్ ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరిచిందే కోహ్లీ అని, ఎప్పుడూ గాయాల బారినప‌డే బుమ్రా ఎలా ఫిట్‌గా ఉన్న‌ట్లు? అంటూ కాంట్రావ‌ర్సీకి దారితీసింది.

ఈ ఫిట్‌నెస్ చర్చపై బుమ్రాకు అశ్విన్ మద్దతు 
ఈ చ‌ర్చ‌లో బుమ్రా వ్యాఖ్య‌ల‌ను స్పిన్న‌ర్‌ సమర్థించాడు. 2022లో గాయం కారణంగా బుమ్రా ఫిట్‌నెస్‌పై విమర్శలు చేసే ముందు టిప్పర్ లారీ, మెర్సిడెస్ బెంజ్ మధ్య వ్యత్యాసాన్ని అభిమానులు అర్థం చేసుకోవాలని అశ్విన్ పేర్కొన్నాడు. ఇక గాయం కారణంగా ఆ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌కు స్టార్ పేస‌ర్‌ దూరమైన విష‌యం తెలిసిందే.

బుమ్రాను టిప్పర్ లారీతో పోల్చిన అశ్విన్
అశ్విన్ తన అభిప్రాయాన్ని వివరించడానికి బుమ్రాను టిప్పర్ లారీతో పోల్చాడు. "బుమ్రా గాయపడ్డాడని మీరు ట‌క్కున‌ చెబుతారు. అతను ఫిట్‌గా ఎలా ఉండగలడు? బాస్.. టిప్పర్ లారీ, మెర్సిడెస్ బెంజ్ మధ్య చాలా తేడా ఉంది. టిప్పర్ లారీ దేశం మొత్తం తిరుగుతుంటుంది. భారీ లోడ్‌ను కూడా మోసుకెళ్తుంది. ఫాస్ట్‌ బౌలర్‌ కూడా టిప్పర్‌ లారీ లాండివాడే. ఒక్కోసారి బ్రేక్‌డౌన్‌ అవుతుంది. అదే బెంజ్ కారును చాలా జాగ్రత్తగా నడుపుతుంటాం" అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

బుమ్రాను 'కోహినూర్ ఆఫ్ ఇండియా' అని ప్రశంసించిన అశ్విన్
 బుమ్రాను అశ్విన్ భార‌త క్రికెట్‌కు కోహినూర్ వజ్రంగా పేర్కొన్నాడు. ఫాస్ట్ బౌలర్‌ను తన ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి అనుమతించాలని అతను కోరాడు. "మీరు ఈ విషయాన్ని ఎందుకు పెద్దది చేయాలనుకుంటున్నారు? జస్ప్రీత్ బుమ్రా ఒక ఫాస్ట్ బౌలర్. అతను మండే ఎండలలో కూడా గంటకు 145 కి.మీ. వేగంతో బంతులను సంధించగలడు. భారత క్రికెట్‌కు అతడు రత్న కిరీటం" అని అశ్విన్ అన్నాడు.

  • Loading...

More Telugu News