Crime News: 1వ తరగతి బాలిక హత్య కేసు దర్యాప్తులో వెలుగులోకి సంచలనాలు
- చిన్నారిని హత్య చేసిన స్కూల్ ప్రిన్సిపాల్
- లైంగిక దాడిని ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్య
- గుజరాత్లో వెలుగుచూసిన దారుణాతి దారుణం
గుజరాత్లో ఓ ఆరేళ్ల బాలిక హత్య కేసు దర్యాప్తులో విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వచ్చాయి. స్కూల్ ప్రిన్సిపాలే చిన్నారిని దారుణంగా హతమార్చాడు. అత్యాచార యత్నాన్ని ప్రతిఘటించడమే ఆ చిన్నారి హత్యకు కారణమైంది. రాష్ట్రంలోని దాహోద్ జిల్లాలో వెలుగుచూసిన ఈ దారుణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
55 ఏళ్ల వయసున్న గోవింద్ నట్ అనే ప్రిన్సిపాల్ తాను పనిచేస్తున్న స్కూల్లో 1వ తరగతి చదువుతున్న చిన్నారిని హత్య చేశాడు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని స్కూల్ కాంపౌండ్‌లో వెలుపల పడేశాడు. చిన్నారి బ్యాగు, బూట్లను తరగతి గదికి సమీపంలో విసిరేశాడు. గత గురువారం హత్య జరగగా అదే రోజు సాయంత్రం పాఠశాల ఆవరణలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా ఆమె ఊపిరాడక చనిపోయినట్టు నిర్ధారణ అయింది. దీంతో కేసు నమోదు చేసి... 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పోలీసుు దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
హత్య జరిగిన రోజు ప్రిన్సిపాల్ గోవింద్ తన కారులో చిన్నారిని స్కూల్‌కు తీసుకెళ్లాడని బాలిక తల్లి చెప్పింది. రోజూ తీసుకెళుతుంటారని వివరించింది. దీంతో పోలీసులు అతడిని ప్రశ్నించారు. చిన్నారిని స్కూల్ వద్దే దించి తాను ఏదో పని మీద బయటకు వెళ్లానని తొలుత అతడు బుకాయించాడు. అయితే అతడు చెప్పిన సమాధానాలు అనుమానాస్పదంగా ఉండడంతో ప్రిన్సిపాల్ ఫోన్ లొకేషన్‌ను పోలీసులు పరిశీలించారు. ఆ రోజు అతడు స్కూల్‌కి చాలా ఆలస్యంగా వెళ్లినట్టు లొకేషన్ ఆధారంగా నిర్ధారించారు. దీంతో మరింత లోతుగా ప్రశ్నించగా ప్రిన్సిపాల్ నేరాన్ని అంగీకరించాడని సీనియర్ పోలీసు అధికారి రాజ్‌దీప్ సింగ్ వెల్లడించారు.
‘‘ హత్య జరిగిన రోజు ఉదయం 10.20 గంటల సమయంలో బాలికను ఆమె తల్లి ప్రిన్సిపాల్ కారులో ఎక్కించింది. ఆ తర్వాత బాలిక ఇంటికి తిరిగి రాలేదు. ఆ రోజు స్కూల్‌కే రాలేదని విద్యార్థులు, టీచర్లు ధృవీకరించారు. దీంతో విచారణ చేయగా నిజాలు వెలుగుచూశాయి. స్కూల్‌కి వెళ్లే మార్గంలో ప్రిన్సిపాల్ ఆమెపై లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడు. అయితే చిన్నారి అరవడం మొదలుపెట్టింది. ఆమె అరవకుండా ప్రిన్సిపాల్ గొంతునొక్కాడు. చిన్నారి చనిపోయింది. ప్రిన్సిపాల్ బాలిక మృతదేహాన్ని కారులోనే ఉంచి తాళం వేశాడు. సాయంత్రం 5 గంటల సమయంలో డెడ్‌బాడీని పాఠశాల భవనం వెనుకవైపు పడేశాడు. స్కూల్ బ్యాగ్, బూట్లను ఆమె తరగతి గదికి సమీపంలో పడేశాడు’’ అని పోలీసు అధికారి వివరించారు.
నిందితుడు గోవింద్ నట్పై భారతీయ న్యాయ్ సంహిత, పోక్సో చట్టం కింద కఠినమైన అభియోగాలు మోపామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన సమాజానికి సిగ్గుచేటు అని గుజరాత్ విద్యాశాఖ మంత్రి కుబేర్ దిండోర్ వ్యాఖ్యానించారు. ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.