Mynampalli Hanumantha Rao: కేటీఆర్! రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నావు... ఇక రేపటి నుంచి కాస్కో: మైనంపల్లి హన్మంతరావు
- బీఆర్ఎస్లో ఉన్నవాళ్లు ఇవాళో... రేపో కాంగ్రెస్‌లోకి వస్తారన్న మైనంపల్లి
- పార్టీలకు అతీతంగా అరికెపూడి గాంధీ అంటే తనకు ఇష్టమని వ్యాఖ్య
- అధికారం కోల్పోగానే తెలంగాణ, ఆంధ్రా అంటూ చిచ్చు పెడుతున్నారని విమర్శ
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు... ఇక రేపటి నుంచి ఉంటుంది కాస్కో అని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు హెచ్చరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు ఇవాళో... రేపో కాంగ్రెస్ పార్టీలోకి వస్తారన్నారు. ఆ పార్టీలో ఉన్నవారిని ఏమీ అనవద్దు... వారు కూడా మనవారేనని వ్యాఖ్యానించారు.
పార్టీలకు అతీతంగా అరికెపూడి గాంధీ అంటే తనకు ఇష్టమని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రూ.10 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని ఆరోపించారు. కానీ గాంధీ మాత్రం ఒక్క రూపాయి ఆశించకుండా నాడు బీఆర్ఎస్లో చేరారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని వెల్లడించారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొండగట్టు బస్సు ప్రమాదం, మాసాయిపేట ఘోర రైలు ప్రమాదం జరిగాయని, ఆ సమయంలో కేసీఆర్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు అధికారం కోల్పోగానే తెలంగాణ, ఆంధ్రా అంటూ చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. సచివాలయాన్ని కూల్చి బీఆర్ఎస్ వాళ్లు నిధులు దోచుకున్నారని ప్రచారం ఉందని, ఈరోజు ఆ సచివాలయంలో అన్నీ లీకులు అవుతున్నాయన్నారు. బీఆర్ఎస్ వాళ్లది క్రిమినల్ మైండ్ అని విమర్శించారు.