Raghu Rama Krishna Raju: రఘురామను కస్టడీలో హింసించిన కేసు... సీఐడీ మాజీ ఏఎస్పీ విజయపాల్ పిటిషన్ కొట్టివేత
- వైసీపీ హయాంలో రఘురామ అరెస్ట్
- కస్టడీలో తనను చిత్రహింసలు పెట్టారంటూ ఇటీవల రఘురామ ఫిర్యాదు
- గుంటూరు నగరంపాలెం పీఎస్ లో కేసు నమోదు
- ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన విజయ్ పాల్
టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును గతంలో ఓ కేసులో అరెస్ట్ చేసి, కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో... సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్ పాల్ కు నేడు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విజయ్ పాల్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
రఘురామ గతంలో నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో... 2021 మే నెలలో సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీ సందర్భంగా తనను కొట్టారని, హత్యాయత్నం కూడా జరిగిందని ఇటీవల రఘురామ గుంటూరు నగరంపాలెం పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న గుంటూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
దాంతో, తనను అరెస్ట్ చేయకుండా విజయ్ పాల్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. విజయ్ పాల్ పిటిషన్ ను హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. అయితే ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.