Ambati Rambabu: డిప్యూటీ సీఎం పవన్‌కు మాజీ మంత్రి అంబటి రాంబాబు సవాలు
- నెయ్యి కల్తీ జరిగినట్టు నిరూపిస్తే పవన్ బూట్లు తుడుస్తానన్న అంబటి రాంబాబు
- మేము తప్పు చేస్తే మీరెందుకు మెట్లు తుడుస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు
- గత టీడీపీ ప్రభుత్వంలో ఆలయాలను కూల్చినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని పవన్‌ను ప్రశ్నించిన వైసీపీ సీనియర్ నేత
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు సవాలు విసిరారు. ‘‘తిరుమల లడ్డూ వ్యవహారంలో మేము తప్పు చేసినట్టు నిరూపించాలి. లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యిని వాడినట్టు నిరూపిస్తే మీ బూట్లు నేను తుడుస్తా’’ అని సవాలు విసిరారు. ఎందుకీ డ్రామాలు ఆడుతున్నారని పవన్‌పై మండిపడ్డారు. విజయవాడ ఇంద్రకీలాద్రి మెట్లను పవన్ శుద్ధి చేయడంపై స్పందిస్తూ... "మేము తప్పు చేస్తే మీరు మెట్లు తుడవడం ఏంటి?" అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
హిందువుల దేవాలయాలపై దాడులు జరుగుతుంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదంటూ పవన్ అన్నారని, నిజానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడలో అనేక దేవాలయాలను పగలగొట్టారని అంబటి రాంబాబు ఆరోపించారు. దేవాలయాల్లోని దేవతామూర్తుల విగ్రహాలను మున్సిపాలిటీ బండ్లపై వేసుకెళ్లారని, సనాతన ధర్మం మీద ఇంత ప్రేమ, భక్తి ఉన్న పవన్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. ‘‘మా మీద రాజకీయంగా కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు... ఇది తప్పు కాదా? ఇది సాంప్రదాయమా? దీన్ని భగవంతుడు క్షమిస్తాడా?’’ అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెళ్లి తిరుమలలో ప్రమాణం చేస్తే... హైడ్రామా చేశారని పవన్ అన్నారని, ఎవరు డ్రామా చేశారో ప్రజలు గ్రహించాలని అంబటి రాంబాబు అన్నారు. ఇంద్రకీలాద్రిపై పవన్ కల్యాణ్ మెట్లు తుడుస్తున్న వీడియోను ఈ సందర్భంగా అంబటి రాంబాబు ప్రదర్శించారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు కల్తీ జరిగిందంటూ నిరూపించలేని ఆరోపణలు చేయడంతో ఆయన తిరుమల వెళ్లి ప్రమాణం చేశారని, దానిని డ్రామా అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.