Cricket Betting: క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన అనంతపురం పోలీసులు
- అనంతపురంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర బెట్టింగ్ ముఠా
- నిందితుల్లో 12 మంది కర్ణాటక, ఏడుగురు హర్యానాకు చెందిన వారు
- ముఠా సభ్యుల నుండి రూ.8.60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును అనంతపురం పోలీసులు రట్టు చేశారు. దులీప్ ట్రోఫీలో భారీ స్థాయిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర బెట్టింగ్ ముఠా సభ్యులు 19 మందిని అనంతపురం రూరల్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ.8.60 లక్షల నగదుతో పాటు 19 సెల్ ఫోన్లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు మీడియాకు వివరించారు.
నిందితుల్లో కర్ణాటకకు చెందిన వారు 12 మంది, హర్యానాకు చెందిన వారు ఏడుగురు ఉన్నట్లు తెలిపారు. ఈ ముఠా సభ్యులు దేశంలో ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగినా లైవ్ మ్యాచ్ చూస్తూ బెట్టింగ్ నిర్వహిస్తారని, మైదానంలో క్రికెట్ చూస్తూ మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రతి ఓవర్, బాల్ కు బెట్టింగ్ పెడతారని చెప్పారు. దులీప్ ట్రోపీ క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో తొలి రోజు నుండే నిఘా పెట్టిన అనంతపురం పోలీసులు .. యాప్లో క్రికెట్ బెట్టింగ్ చేస్తుండగా ఈ ముఠాను పట్టుకున్నారు.