Kamala Harris: కమలాహారిస్ ప్రచార కార్యాలయంపై అర్ధరాత్రి కాల్పులు

Shots Fired On Kamala Harris Campaign Office In Arizona
  • అధ్యక్ష ఎన్నికల వేళ కలకలం రేపుతున్న కాల్పులు
  • కార్యాలయం కిటికీ నుంచి కాల్పులు జరిపినట్టు గుర్తింపు 
  • అర్ధరాత్రి ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
  • ఇప్పటికే ట్రంప్‌పై రెండుసార్లు హత్యాయత్నం
అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల కాల్పులు జరగ్గా, తాజాగా డెమొక్రటిక్ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కార్యాలయంపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. అరిజోనాలోని ఆమె సమన్వయ ప్రచార కార్యాలయంపై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కార్యాలయం కిటికీల నుంచి కాల్పులు జరిపినట్టు గుర్తించారు. అర్ధరాత్రి కావడం, లోపల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

ట్రంప్‌పై ఇప్పటికే రెండుసార్లు కాల్పులు జరిగాయి. తొలిసారి పెన్సిల్వేనియాలో ఎన్నికల సభలో ప్రసంగిస్తుండగా నిందితుడు జరిపిన కాల్పుల్లో ట్రంప్ కుడిచెవికి గాయమైంది. ఇటీవల మళ్లీ కాల్పులు జరిగాయి. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా హత్యాయత్నం జరిగింది. ఫెన్సింగ్ వద్దకు తుపాకితో వచ్చిన నిందితుడిని భద్రతా బలగాలు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నాయి. కాగా, నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్షుడు జోబైడెన్ బరిలో ఉండగా ముందంజలో ఉన్న ట్రంప్.. కమలా హారిస్ పోటీలోకి వచ్చాక మాత్రం వెనకబడిపోయారు.
Kamala Harris
USA
Donald Trump

More Telugu News