Kangana Ranaut: ఎట్టకేలకు సారీ చెప్పిన కంగన.. ఎందుకంటే..!
- వ్యవసాయ చట్టాలు తిరిగి తీసుకురావాలంటూ కంగన వ్యాఖ్యలు
- రైతులు సహా పలు వర్గాల్లో కంగనాపై విమర్శలు
- ఆ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధంలేదంటూ బీజేపీ వివరణ
వ్యవసాయ చట్టాలను కేంద్రం తిరిగి తీసుకురావాలని, అందుకోసం రైతులే కేంద్రానికి విజ్ఞప్తి చేయాలంటూ బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అటు రైతులు, ఇటు మేధావులు తీవ్రంగా మండిపడ్డారు.
సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో బీజేపీ కూడా దీనిపై స్పందించింది. కంగన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవని, పార్టీకి ఆ వ్యాఖ్యలతో సంబంధంలేదని వివరణ ఇచ్చింది. బీజేపీ తరఫున మాట్లాడేందుకు కంగనాకు ఎలాంటి అధికారం లేదని స్పష్టం చేసింది. ఈమేరకు బీజేపీ సీనియర్ నేత గౌరవ్ భాటియా ట్విట్టర్ లో ఓ వీడియో విడుదల చేశారు. పార్టీ నుంచి ఒత్తిడి రావడంతో కంగన ఎట్టకేలకు స్పందించి, సారీ చెప్పారు. తన వ్యాఖ్యలు కొంతమందిని బాధించాయని, వారికి ఈ సందర్భంగా క్షమాపణ చెబుతున్నానంటూ ఎంపీ ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
తాను ప్రస్తుతం నటిని మాత్రమే కాదని, బీజేపీ సభ్యురాలినని కూడా కంగన చెప్పారు. పార్టీ విధివిధానాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీ సీనియర్ నేత గౌరవ్ భాటియా వీడియోను రీట్వీట్ చేస్తూ.. వ్యవసాయ చట్టాలపై తన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధంలేదని చెప్పారు. బీజేపీ మెంబర్ గా వ్యవసాయ చట్టాలపై పార్టీ స్టాండ్ కు అనుగుణంగా మాట్లాడాల్సిన బాధ్యత తనకుందని చెప్పారు. అందుకే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని, ఆ వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే క్షమించాలని పేర్కొంటూ బుధవారం ట్విట్టర్ లో వీడియో విడుదల చేశారు.