Nara Lokesh: సీబీఐ విచారణ కోరుతున్న వైసీపీ... కౌంటర్ ఇచ్చిన మంత్రి నారా లోకేశ్
- తిరుమల లడ్డూ వ్యవహారంలో గత ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు
- ప్రమాణాలకు సిద్ధం అంటున్న వైసీపీ నేతలు
- సీబీఐ విచారణకు డిమాండ్
- బాబాయి హత్యకు సీబీఐ విచారణ ఎందుకు కోరలేదన్న నారా లోకేశ్
తిరుపతి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై వైసీపీ భగ్గుమంటోంది. తాము ఏ తప్పు చేయలేదని వైసీపీ నేతలు ప్రమాణాలకు సై అంటున్నారు. కావాలంటే ఈ వ్యవహారంలో సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు.
సీబీఐ విచారణ పట్ల వైసీపీ వాళ్లకు అంత ప్రేమ ఉంటే... బాబాయి హత్యపై జగన్ ఎందుకు సీబీఐ విచారణ వేయలేదని సూటిగా ప్రశ్నించారు.
"సీబీఐ విచారణ వేయాలని సునీత గారే అడిగారు కదా... మరి ఎందుకు వేయలేదు? అంతేకాకుండా, సీబీఐ కోర్టుకు వెళ్లకుండా జగన్ ఎందుకు ఎగ్గొడుతున్నాడు? వైవీ సుబ్బారెడ్డి గారు తిరుమలలో ప్రమాణం గురించి చాలెంజ్ చేశారు... ఆ తర్వాత నేను తిరుపతి వెళ్లాను... 24 గంటలు నేను ఇక్కడే ఉంటాను సర్... మీరు రండి అని చెప్పాను... వాళ్లు ఎందుకు రాలేదు?
మార్కెట్ ధర కంటే 40 శాతం తక్కువ ధరకే నెయ్యి సరఫరా చేశారంటే దాని అర్థం ఏంటండీ? తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తుండడం చాలా బాధాకరం. నెయ్యి కల్తీకి సంబంధించి డాక్యుమెంట్లు, నివేదికలు, టెండర్ల ప్రక్రియ ఎలా జరిగిందనే విషయాలు అన్నీ బహిర్గతం చేశాం... దీనిపై మేం సిట్ వేస్తున్నాం.
గతంలో కనీసం రూ.250 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థ నుంచే కొనుగోలు చేయాలన్నారు... దాన్ని రూ.150 కోట్లకు తగ్గించింది ఎవరు? వైసీపీ ప్రభుత్వమే కదా! ఇవన్నీ తగ్గించారు కాబట్టే లడ్డూ నాణ్యత లేకుండా పోయింది... తద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి... అది మనందరం అర్థం చేసుకోవాలి.. ఇలాంటప్పుడు చేయాల్సింది రాజకీయం కాదు" అని లోకేశ్ పేర్కొన్నారు.