Karnataka: కర్ణాటకలో సీబీఐకి నో ఎంట్రీ... సీఎం సిద్ధ రామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం

Karnataka govt withdrew open consent to the CBI to conduct inquiries within its territory
  • రాష్ట్రంలో సీబీఐకి బహిరంగ సమ్మతిని రద్దు చేసిన ప్రభుత్వం
  • ముడా కుంభకోణం కేసు నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం
  • పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల సరసన చేరిన కర్ణాటక
  • రాష్ట్ర ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక అనుమతి తీసుకుంటేనే సీబీఐ దర్యాప్తునకు అవకాశం
మైసూర్ నగరాభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించిన ఈ కేసులో సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక భూభూగంలో సీబీఐ దర్యాప్తునకు సాధారణ సమ్మతిని సీఎం సిద్ధ రామయ్య ప్రభుత్వం ఉపసంహరించుకుంది. పక్షపాతంగా వ్యవహరిస్తున్న సీబీఐకి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ తెలిపారు. 

రాష్ట్రంలో సీబీఐ విచారణకు బహిరంగ సమ్మతిని ఉపసంహరించుకుంటున్నామని, ఈ దర్యాప్తు సంస్థను దుర్వినియోగం చేస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు హెచ్‌కే పాటిల్ పేర్కొన్నారు. వారు (కేంద్ర ప్రభుత్వ పెద్ద) పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ‘ముడా’ ఆరోపణల కారణంగా ఈ నిర్ణయం తీసుకోలేదని పాటిల్ చెప్పారు. 

‘‘మేము సీబీఐకి సూచించిన కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేయలేదు. చాలా కేసులను పెండింగ్‌లో ఉంచారు. మేము పంపిన కేసులను దర్యాప్తు చేసేందుకు నిరాకరించారు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. తప్పుడు మార్గంలో వెళ్లకుండా సీబీఐని నియంత్రించే చర్య ఇది’’ అని పాటిల్ పేర్కొన్నారు.

కాగా సీబీఐకి బహిరంగ సమ్మతిని రద్దు చేసిన రాష్ట్రాల జాబితాలో తాజాగా కర్ణాటక చేరింది. అంతకంటే ముందు పశ్చిమ బెంగాల్, డీఎంకే అధికారంలో ఉన్న తమిళనాడు, వామపక్షాల పాలనలో ఉన్న కేరళ కూడా తమ రాష్ట్రాల్లో సీబీఐ దర్యాప్తునకు బహిరంగ అనుమతిని రద్దు చేశాయి. దీంతో రాష్ట్ర పరిధిలో సీబీఐ ఏదైనా కేసుపై దర్యాప్తు జరపాలంటే రాష్ట్ర ప్రభుత్వాల లిఖితపూర్వక అనుమతిని పొందాల్సి ఉంటుంది.
Karnataka
CBI
Siddaramaiah
Congress

More Telugu News