YS Jagan: నేడు తిరుమలకు వైఎస్ జగన్ .. పార్టీ శ్రేణులకు కీలక సూచన
- రేపు(శనివారం) ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న వైఎస్ జగన్
- తిరుపతి జిల్లాలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు
- తన పర్యటనలో ఎలాంటి హడావుడి వద్దని పార్టీ శ్రేణులకు జగన్ సూచన
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి రేపు (శనివారం) తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం (ఈరోజు) రాత్రికి తిరుమల చేరుకుంటారు. వైఎస్ జగన్ .. ఈరోజు సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుండి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుండి బయలుదేరి రాత్రి 7 గంటలకు తిరుమల చేరుకుంటారు. రాత్రి తిరుమల గెస్టు హౌస్ లో బస చేసి శనివారం ఉదయం 10.20 గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు. తదుపరి తిరుమల నుండి తిరుగు ప్రయాణం అవుతారు. ఈ మేరకు జగన్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
మరోపక్క, తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పార్టీ శ్రేణులకు కీలక అదేశాలు ఇచ్చారు. తన తిరుమల పర్యటనలో ఎలాంటి హడావుడి వద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రశాంత వాతావరణంలో శ్రీవారిని దర్శించుకోవాలని భావిస్తున్నానని జగన్ పేర్కొన్నారు.