YS Jagan: జగన్ నుంచి డిక్లరేషన్ అడగడానికి సిద్ధమవుతున్న టీటీడీ?

ys jagan to visit tirumala declaration call sparks row

  • నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్
  • డిక్లరేషన్ పై సంతకం చేసిన తర్వాతనే జగన్ కు అనుమతి ఇవ్వాలని ఈవోకు పలువురు వినతి
  • జగన్ పర్యటనను అడ్డుకుంటామని భానుప్రకాశ్ రెడ్డి హెచ్చరిక 

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించిన అంశం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ అంశం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. దీనిపై ఇటు కూటమి, అటు వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలను, తిరుమల లడ్డూను, వెంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేశారని, ఆ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబర్ 28న (శనివారం) పూజల్లో పాల్గొనాలని వైసీపీ పిలుపునిచ్చింది. 

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి సిద్ధమయ్యారు. అయితే జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్యమతస్థుల నుంచి డిక్లరేషన్ కోరినట్లే వైఎస్ జగన్ నుంచీ తీసుకోవాలని టీటీడీ అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ముందుగానే అతిధి గృహం వద్దకు వెళ్లి ఆయనకు డిక్లరేషన్ ఫారాన్ని అందించనున్నారు. ఆయన సంతకం చేస్తే దర్శనానికి అనుమతిస్తారు. తిరస్కరిస్తే దేవాదాయ శాఖ చట్టప్రకారం నడుచుకుంటామని టీటీడీ అధికారులు చెబుతున్నారు. గతంలో పలు మార్లు జగన్ డిక్లరేషన్ పై హిందూ సంఘాలు, టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు డిమాండ్ చేసినా ఆయన పట్టించుకోలేదు. 

అయిదేళ్ల వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ పలు మార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయాల్లో టీటీడీ అధికారులు ఎవ్వరూ డిక్లరేషన్ గురించి అడగలేదు. ఇప్పుడు మళ్లీ డిక్లరేషన్ వివాదం రాజుకుంది. డిక్లరేషన్ పై సంతకం చేసిన తర్వాతనే దర్శనానికి అనుమతించాలని ఈవోకు పలువురు విజ్ఞప్తి చేశారు. మరో వైపు జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటామని బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో డిక్లరేషన్ అంశంపై జగన్ ఏ విధంగా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

  • Loading...

More Telugu News