YS Sharmila: చంద్రబాబుకు ఓట్లు పడటానికి కారణం ఇదే: షర్మిల
- జగన్ పై వ్యతిరేకత వల్లే చంద్రబాబుకు ఓట్లు పడ్డాయన్న షర్మిల
- చంద్రబాబును 38 శాతం ఓటర్లు వద్దనుకున్నారని వ్యాఖ్య
- ఏపీకి కాంగ్రెస్ మనుగడ చాలా ముఖ్యమన్న షర్మిల
వైసీపీ అధినేత జగన్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్లే చంద్రబాబుకు ఓట్లు పడ్డాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కూటమి పార్టీలపై ప్రేమతో ఓట్లు పడలేదని ఆమె చెప్పారు. చంద్రబాబు సీఎంగా వద్దు అనుకున్న ఓటర్లు కూడా 38 శాతం మంది ఉన్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ మనుగడ ఏపీకి ఎంతో అవసరమని షర్మిల చెప్పారు. పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసుకుందామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని... ఆ ఎన్నికలను ప్రతి కార్యకర్త సవాల్ గా తీసుకోవాలని చెప్పారు. 2029 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు.
అన్ని పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు ఉండేలా చూసుకోవాలని పార్టీ నేతలకు షర్మిల చెప్పారు. కింది స్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణం జరగాలని అన్నారు. బీజేపీపై చంద్రబాబు, జగన్ ఇద్దరూ మాట్లాడరని... ఒకరు అధికారికంగా, మరొకరు ఆ పార్టీతో లాలూచీపడి పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి బీజేపీ చేసిన అన్యాయంపై అక్టోబర్ 2న నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు.