DY Chandrachud: సుప్రీంకోర్టు సిబ్బంది కోసం '12 ఫెయిల్' సినిమా ప్రత్యేక ప్రదర్శన.. వీక్షించాక చీఫ్ జస్టిస్ స్పందన ఇదే
- సుప్రీంకోర్ట్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు అందరికీ స్ఫూర్తినిచ్చేలా ఉందన్న సీజేఐ డీవై చంద్రచూడ్
- చిత్ర నిర్మాత, నటీనటులపై ప్రశంసల జల్లు
- ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ కూడా హాజరు
- ఆయన జీవిత కథ ఆధారంగానే రూపుదిద్దుకున్న సినిమా
ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా రూపొందించిన సూపర్ డూపర్ హిట్ మూవీ ‘12 ఫెయిల్’ను (12th Fail) సుప్రీంకోర్టు సిబ్బంది కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. సీజేఐ డీవై చంద్రచూడ్, ఇతర సుప్రీంకోర్ట్ జడ్జిల కోసం బుధవారం స్క్రీనింగ్ చేసిన ఈ సినిమాను దాదాపు 600 మంది వీక్షించారు. న్యాయమూర్తులు, అధికారులతో పాటు వారి కుటుంబ సభ్యులు చూశారు.
సినిమా పూర్తయిన అనంతరం చిత్ర నిర్మాత విధు వినోద్ చోప్రా, నటులు విక్రాంత్ మాస్సే, మేధా శంకర్లతో చంద్రచూడ్ మాట్లాడారు. ఈ సినిమాను వీక్షించేందుకు వచ్చిన ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ, ఆయన భార్య, ఐఆర్ఎస్ అధికారి శ్రద్ధా జోషితో కూడా ముచ్చటించారు.
‘12 ఫెయిల్’ సినిమా తన కుటుంబం మొత్తానికి స్ఫూర్తిని ఇచ్చిందని సీజేఐ డీవై చంద్రచూడ్ అభినందించారు. ‘‘మా సుప్రీంకోర్టు సిబ్బంది కుటుంబంలోని ప్రతి ఒక్క సభ్యుడిని, వారి పిల్లలను, స్నేహితులను ప్రోత్సహించడానికి, దేశాన్ని సరికొత్త శిఖరాల వైపు నడిపించడానికి ఈ సినిమా నిజమైన ప్రేరణ ఇస్తుందని నేను నమ్ముతున్నాను. మన చుట్టూ ఉన్నవారి కోసం ప్రతిరోజూ ఏదైనా మెరుగైన పని చేయడానికి ఇలాంటి సినిమాలు స్ఫూర్తినిస్తాయి’’ అని అన్నారు.
చిత్ర నిర్మాత వినోద్ చోప్రాపై చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ప్రశంసల జల్లుకురిపించారు. నిజ జీవిత కథను తెరపైకి తీసుకొచ్చిన విధానం అభినందనీయమని మెచ్చుకున్నారు. విక్రాంత్, మేధా ఇద్దరూ గొప్పగా నటించారని కొనియాడారు. ఇద్దరూ తమతమ పాత్రల్లో జీవించారని మెచ్చుకున్నారు.
సినిమా చూస్తున్నప్పుడు పలు సన్నివేశాల్లో కళ్లు చెమర్చాయని, చేతి రుమాలు అవసరమని భావించిన సందర్భాలు చిత్రంలో ఉన్నాయని చెప్పారు. నమ్మకంపై ఈ సినిమా బలమైన సందేశం ఇచ్చిందని అన్నారు. తమతో సమయం గడిపిన అధికారులతో పాటు '12 ఫెయిల్' బృందానికి సుప్రీంకోర్ట్ సిబ్బంది, ఉద్యోగుల తరపున సీజేఐ కృతజ్ఞతలు తెలియజేశారు.
కాగా 12 ఫెయిల్ సినిమా అక్టోబర్ 27, 2023న థియేటర్లలో విడుదలైంది. ఒక సాధారణ కుటుంబానికి చెందిన మనోజ్ కుమార్ శర్మ అనే యువకుడు ఎలా ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారనే నిజజీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.