Nitin Gadkari: ప్రస్తుత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి: నితిన్ గడ్కరీ ఆవేదన
- ఇది వరకు సమాజసేవ, అభివృద్ధికి పర్యాయపదంగా రాజకీయాలు ఉండేవన్న గడ్కరీ
- ఇప్పుడు అంతా పవర్ పాలిటిక్స్ వచ్చాయని వ్యాఖ్య
- తాను ఉపయోగించే ఆటోను ఎమర్జెన్సీ తర్వాత తగులబెట్టారని గుర్తు చేసుకున్న గడ్కరీ
ప్రస్తుత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదివరకు సమాజసేవ, దేశ నిర్మాణం, అభివృద్ధికి పర్యాయపదంగా రాజకీయాలు ఉంటే, ఇప్పుడు పవర్ పాలిటిక్స్ వచ్చాయన్నారు. మహారాష్ట్రలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... తాను ఆరెస్సెస్ కార్యకర్తగా పని చేసిన రోజుల్లో ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నానని, ఆ రోజుల్లో తగిన గుర్తింపు ఉండేది కాదన్నారు.
తాను బీజేపీ కార్యకర్తగా ఇరవై ఏళ్ల పాటు విదర్భలో పని చేశానని, ఆ రోజుల్లో తాము నిర్వహించే ర్యాలీలపై కొంతమంది రాళ్ళు రువ్వేవారని గుర్తు చేసుకున్నారు. తాను ఆ రోజుల్లో ఆటోలో వెళ్లి ప్రసంగాలు చేశానని, ఎమర్జెన్సీ తర్వాత ఆ ఆటోను కొంతమంది తగులబెట్టారని వెల్లడించారు. ఈరోజు తాను ఇక్కడ మాట్లాడుతున్నానంటే అందుకు కారణం ప్రాణాలకు ఎదురొడ్డి కష్టపడిన కార్యకర్తలదే అన్నారు.
ప్రధాని పదవి ఆఫర్‌పై స్పందించిన గడ్కరీ
తనకు పలుమార్లు ప్రధానమంత్రి పదవి ఆఫర్లు వచ్చాయని నితిన్ గడ్కరీ వెల్లడించారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కూడా తనను ప్రధాని అభ్యర్థిగా ముందుకు రావాలని ప్రతిపక్షాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయన్నారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు వస్తే తనకు మద్దతు ఇస్తామని ప్రతిపక్షాలు చెప్పాయని తెలిపారు.
మోదీకి బదులు తనను ప్రధానిగా అంటే పార్టీలో చీలిక తీసుకు రావాలనేది ప్రతిపక్షాల ఆలోచన అన్నారు. అయితే తాను తన భావజాలంతో రాజీపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. తన లక్ష్యం ప్రధాని పదవి కాదని, మోదీ పాలనలో తన బాధ్యతలపై చాలా సంతృప్తికరంగా ఉన్నానన్నారు.