IVF: ఐవీఎఫ్ విధానంలో పుట్టిన పిల్లలకు గుండె జబ్బుల ముప్పు.. స్వీడన్ పరిశోధకుల వెల్లడి

IVF Babies Are At a Higher Risk Of Developing Serious Heart Defects Study Finds

  • కవలలు పుడితే రిస్క్ మరింత పెరుగుతోందని వివరణ
  • డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ లలో అధ్యయనం
  • 77 లక్షల మంది పిల్లల హెల్త్ రికార్డులు పరిశీలించిన సైంటిస్టులు

సంతానం కలగని దంపతులకు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) విధానం ఓ వరం.. ఏళ్ల తరబడి పిల్లల కోసం ఎదురుచూసి ఇక తమ కడుపు పండే యోగంలేదని నిరాశ చెందిన చాలామంది మహిళలు ఐవీఎఫ్ వల్ల తల్లయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విధానం ఎంతోమంది దంపతులను తల్లిదండ్రులుగా మార్చింది. అయితే, ఇప్పుడీ విధానంపై స్వీడన్ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలకు గుండె జబ్బులు పెరుగుతున్నాయని తమ పరిశోధనలో తేలిందని వెల్లడించారు. సాధారణంగా జన్మించిన పిల్లలతో పోలిస్తే ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలకు గుండె జబ్బులు వచ్చే ముప్పు 36 శాతం ఎక్కువని చెప్పారు. ఈ విధానం ద్వారా పుట్టిన కవల పిల్లల్లో రిస్క్ మరింత ఎక్కువని అన్నారు. స్వీడన్ లోని గోథెన్ బర్గ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఉల్లా బ్రిట్ వెనర్ హాల్మ్ ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. హ్యూమన్ రీప్రొడక్షన్ జర్నల్ ఈ పరిశోధన వివరాలను ప్రచురించింది.

ప్రొఫెసర్ ఉల్లా బ్రిట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఐవీఎఫ్ విధానంలో జన్మించిన పిల్లలలో గుండె పనితీరులో లోపాలను గుర్తించామని చెప్పారు. ఇది చాలా సీరియస్ ముప్పు అని, ఈ లోపాలను వీలైనంత తొందరగా గుర్తించి, చిన్నతనంలోనే స్పెషలిస్ట్ సర్జరీ చేయాల్సిన అవసరం ఏర్పడుతోందని వివరించారు. ఐవీఎఫ్ ద్వారా గర్భందాల్చిన మహిళలు ఒకరి కంటే ఎక్కువ మందికి జన్మనిస్తే.. వారికి ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉండడం తాము గుర్తించామని తెలిపారు. 

ఫిన్లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వే దేశాలలో 1980 లలో జన్మించిన దాదాపు 77 లక్షల మంది చిన్నారులకు సంబంధించిన హెల్త్ డేటాను పరిశీలించగా ఈ విషయం బయటపడిందని ప్రొఫెసర్ ఉల్లా బ్రిట్ పేర్కొన్నారు. సాధారణ పద్ధతిలో జన్మించిన పిల్లలతో పోలిస్తే ఐవీఎఫ్ వంటి పద్ధతులలో జన్మించిన పిల్లల్లో గుండె లోపాలు ఎక్కువగా కనిపించాయన్నారు. అయితే, ఇది జాతీయత, తల్లి వయసు, ప్రెగ్నెన్సీ సమయంలో పొగతాగే అలవాటు, మధుమేహం, తల్లికి గుండె లోపాలకు సంబంధించిన జబ్బులు తదితర అంశాలను బట్టి పుట్టిన పిల్లలకు రిస్క్ మారుతుందని ప్రొఫెసర్ ఉల్లా బ్రిట్ వివరించారు.

  • Loading...

More Telugu News