AP Dy CM: పవన్ కల్యాణ్ ను డిక్లరేషన్ అడుగుతారా.. టీటీడీకి వైసీపీ నేత ప్రశ్న
- తన కుటుంబం బాప్టిజం తీసుకుందని పవన్ గతంలో చెప్పారన్న నారాయణ స్వామి
- ఐదేళ్లు సీఎం హోదాలో శ్రీవారికి జగన్ పట్టువస్త్రాలు సమర్పించారన్న వైసీపీ నేత
- అప్పుడు ఎలాంటి డిక్లరేషన్ అడగలేదని గుర్తుచేసిన మాజీ డిప్యూటీ సీఎం
- ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారని నిలదీసిన వైసీపీ నేత
శ్రీవారి ప్రసాదం లడ్డూ అపవిత్రమైందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీక్ష ముగింపునకు ఆయన తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ నేత నారాయణస్వామి సంచలన ఆరోపణలు చేశారు. పవన్ కల్యాణ్ ను కూడా డిక్లరేషన్ అడగాలని డిమాండ్ చేశారు. రష్యన్ ను పెళ్లి చేసుకున్నానని, తన కుటుంబం బాప్టిజం తీసుకుందని గతంలో పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. ఈ క్రమంలో ఆయనను కూడా డిక్లరేషన్ అడుగుతారా అని టీటీడీని ప్రశ్నించారు. ఈ విషయంలో టీడీపీ, బీజేపీ పార్టీల నేతలు పవన్ ను ప్రశ్నిస్తారా అని నిలదీశారు. సోనియా గాంధీ డిక్లరేషన్ ఇచ్చే తిరుమలకు వచ్చారా..? అని అడిగారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఐదేళ్ల పాటు ప్రభుత్వం తరఫున శ్రీవారికి జగన్ పట్టువస్త్రాలు సమర్పించారని నారాయణస్వామి గుర్తుచేశారు. అప్పుడు జగన్ నుంచి టీటీడీ ఎలాంటి డిక్లరేషన్ అడగలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నప్పుడూ జగన్ ను డిక్లరేషన్ అడగలేదన్నారు. అప్పుడు అడగని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారని టీటీడీ అధికారులను నిలదీశారు. దీంతో తిరుమల లడ్డూ కల్తీ వివాదం మరో మలుపు తిరిగింది. తిరుమలకు వచ్చే హిందూయేతరులు తప్పనిసరిగా సమర్పించాల్సిన డిక్లరేషన్ చుట్టూ చర్చ జరుగుతోంది.
పవన్ పై తీవ్ర ఆరోపణలు..
పవన్ పై తాము నిందలు వేయడంలేదని నారాయణస్వామి వివరించారు. గతంలో పవన్ స్వయంగా చెప్పిన విషయాలనే తాము గుర్తుచేస్తున్నామని తెలిపారు. దేవుడు లేడని తన తండ్రి అనేవారంటూ పవన్ చాలాసార్లు చెప్పారన్నారు. తనకు కులం, మతం, పార్టీలు లేవని పవన్ చెప్పారన్నారు. హిందువులే రెచ్చగొట్టి గొడవలు చేస్తున్నారని కూడా పవన్ అన్నారని తెలిపారు. ప్రజాసేవ అంటే సినిమా కాదని, ఉదయం పూజలు చేసి సాయంత్రం షూటింగ్ కు వెళ్లడం సేవ కాదని నారాయణస్వామి అన్నారు.