Nara Bhuvaneswari: రాబోయే పండుగలకు చేనేత వస్త్రాలు కొనుగోలు చేద్దాం: నారా భువనేశ్వరి
- దసరా సీజన్ సందర్భంగా నారా భువనేశ్వరి వీడియో సందేశం
- పండుగలకు చేనేత వస్త్రాలు ధరిద్దాం అంటూ పిలుపు
- నేతన్నల ఇళ్లలోనూ ఆనందం నింపుదామని సూచన
రాబోయే పండుగలకు చేనేత వస్త్రాలు కొనుగోలు చేద్దాం అంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. పండుగ వేళ చేనేత దుస్తులు ధరించుదాం... నూలుపోగుతో అద్భుతాలు సృష్టించే చేనేత కార్మికులు కూడా మరింత ఆనందంగా పండుగ చేసుకునేలా చేద్దాం అని సూచించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో సందేశం వెలువరించారు.
"తెలుగు రాష్ట్రాల ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు... దసరా శుభాకాంక్షలు. నిజం గెలవాలి పర్యటన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులను కలిశాను. వారి కష్టనష్టాలను తెలుసుకున్నాను.
మన తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల చేనేత వస్త్రాల తయారీకి ప్రసిద్ధి చెందినవి. నూలు సేకరించడం నుంచి వస్త్రాన్ని రూపొందించే వరకు ఆ కార్మికుడు పడే కష్టాలు, ఇబ్బందులు ఎన్నో.
యాసిడ్, బ్లీచింగ్ మధ్య నిల్చుని ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా చేనేత కార్మికులు వస్త్రాలు రూపొందిస్తున్నారంటే మనమంతా ఒకటే ఆలోచించాలి. తమ బిడ్డల కోసం, తమ కుటుంబం కోసం చేనేత ఇన్ని సమస్యలు ఎదుర్కొని ముందుకు వెళుతున్నారు.
అందుకే నేతన్నలకు సంఘీభావంగా రాబోయే పండుగలకు మనం చేనేత వస్త్రాలను ధరిద్దాం. చేనేత వస్త్రాలు కొనుగోలు చేయడం ద్వారా నేతన్నల ఆనందంలో మనం కూడా పాలుపంచుకుందాం. మన చేనేత, మన సంస్కృతి, మన సంప్రదాయం" అంటూ నారా భువనేశ్వరి వివరించారు.