Nepal Floods: నేపాల్ లో వరదలు 112 మంది మృతి
- మరో 68 మంది గల్లంతయ్యారని అధికారుల వెల్లడి
- 54 ఏళ్ల తర్వాత రికార్డు వర్షపాతం నమోదు
- ఖాట్మండులో ఉప్పొంగుతున్న నదులు, ఇళ్లలోకి వరద
భారీ వర్షాలతో నేపాల్ వణికిపోతోంది.. నదులు ఉప్పొంగి గ్రామాలు, పట్టణాలను ముంచేశాయి. దేశ రాజధాని ఖాట్మండులో పలు కాలనీలు జలమయంగా మారాయి. వరదలు ముంచెత్తడం, కొండచరియలు విరిగిపడడంతో 24 గంటల వ్యవధిలోనే 112 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వంద మందికి పైగా గాయపడగా.. 68 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఒక్కరోజే నేపాల్ లో రికార్డు వర్షపాతం నమోదైంది.
గడిచిన 54 ఏళ్లలో ఎన్నడూ కురవనంత వర్షం ఒక్కరోజే కురిసిందని అధికారులు చెప్పారు. ఏకంగా 323 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. వర్షాలు, వరదలకు దేశవ్యాప్తంగా 4.12 లక్షల ఇళ్లు ప్రభావితం అయ్యాయని వివరించారు. ఖాట్మండు చుట్టుపక్కల ప్రాంతాల్లోని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని తెలిపారు. వరదలకు పలు ఇళ్లు కూలిపోగా రహదారులు కొట్టుకుపోయాయని చెప్పారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.