Actor Nikhil: వరదల సమయంలో చంద్రబాబు సూపర్‌గా పనిచేశారు.. నటుడు నిఖిల్ ప్రశంసలు

Tollywood Actor Nikhil Praises Chandrababu And Nara Lokesh
  • మంగళగిరిలో 10కే, 5కే, 3కే రన్
  • ప్రారంభించిన సినీ నటుడు నిఖిల్
  • కార్యక్రమానికి ఐదు వేల మంది హాజరు
  • మంగళగిరిని లోకేశ్ రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతున్నారని ప్రశంస
విజయవాడకు ఇటీవల సంభవించిన వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అద్భుతంగా పనిచేశారని ప్రముఖ సినీ నటుడు నిఖిల్ సిద్ధార్థ ప్రశంసల వర్షం కురిపించారు. ‘అందరి కోసం అమరావతి’ పేరుతో ఆదివారం మంగళగిరిలో నిర్వహించిన 10కే, 5కే, 3కే రన్‌ను నిఖిల్, ఆరో బెటాలియన్ కమాండెంట్ నగేశ్‌బాబు, కామన్వెల్త్ క్రీడాకారిణి ఘట్టమనేని సాయిరేవతి ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిఖిల్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు ఇలాంటి రన్స్ అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు ఐదువేలమంది హాజరు కావడం ఆనందంగా ఉందన్నారు. విజయవాడ వరదల సమయంలో చంద్రబాబు, ఇతర మంత్రులు అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. సాధారణంగా ఇలాంటి విపత్తులు వస్తే కోలుకునేందుకు చాలా సమయం పడుతుందని కానీ, ప్రభుత్వం సత్వరం స్పందించడం వల్ల ప్రజలు చాలా త్వరగా కోలుకున్నారని పేర్కొన్నారు.

తాను మంగళగిరి వస్తున్నప్పుడు చూశానని, రోడ్లు కానీ, పరిసరాలు, లైటింగ్ ఎంతో బాగున్నాయని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గాన్ని మంత్రి లోకేశ్ రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. కార్తికేయ సీక్వెల్ కార్తికేయ-3 సినిమా గురించి మాట్లాడుతూ త్వరలోనే ఆ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని నిఖిల్ చెప్పారు. ప్రస్తుతం స్వయంభూ షూటింగ్ జరుగుతున్నట్టు నిఖిల్ తెలిపారు.

Actor Nikhil
Tollywood
Mangalagiri
Chandrababu
Nara Lokesh

More Telugu News