Rape Accused: బాలికపై యువకుడి అత్యాచారం... ఆగ్రహంతో నిందితుడి ఇంటికి నిప్పు పెట్టిన గ్రామస్థులు

Villagers Protest Infront Of Rape Accused Home In Siddipet District
  • సిద్దిపేట జిల్లా గురువన్నపేటలో ఉద్రిక్తత
  • కార్లు ధ్వంసం చేసిన మహిళలు
  • నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు 
అభంశుభం తెలియని బాలికపై అత్యాచారం చేసిన యువకుడిపై గ్రామస్తులు మండిపడ్డారు. ఇదేం పనంటూ నిలదీసేందుకు నిందితుడి ఇంటికి వెళ్లారు. అయితే, అప్పటికే సదరు యువకుడు పరారయ్యాడు. దీంతో కోపం పట్టలేక నిందితుడి ఇంటికి గ్రామస్తులు నిప్పు పెట్టారు. పోలీసుల ముందే ఇంటి ముందున్న కార్లను మహిళలు ధ్వంసం చేశారు. పోలీసులు అడ్డుకుంటున్నా ఆగకుండా నిందితుడి ఇంటిపై దాడి చేశారు. సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మండలం గురువన్న పేట గ్రామంలో చోటుచేసుకుందీ ఘటన..

బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బాలికపై గ్రామానికే చెందిన ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు మండిపడ్డారు. చుట్టుపక్కల వారితో కలిసి నిందితుడి ఇంటికి వెళ్లారు. అత్యాచారం విషయం తెలిసి గ్రామస్థులంతా అక్కడికి చేరుకున్నారు. ఈ విషయం తెలిసి నిందితుడు పరారయ్యాడు.

గ్రామస్థుల ఆందోళన విషయం తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, గ్రామస్థులు వెనక్కి తగ్గలేదు. ఆగ్రహంతో నిందితుడి ఇంట్లో పెట్రోల్ చల్లి నిప్పంటించారు. ఇంటి ముందు నిలిపిన వాహనాలపై మహిళలు దాడి చేశారు. అద్దాలు పగలగొట్టారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి గ్రామస్తులను చెదరగొట్టారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కొమురవెల్లి పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Rape Accused
Fire
Minor Student
Siddipet District
Komuravelli

More Telugu News