Janaka Aithe Ganaka: సుహాస్‌కి ఇది అసలు సిసలైన బాక్సాఫీస్ పరీక్ష.. ఇందులో పాస్ కాకపోతే గనక?
- అక్టోబర్ 12న విడుదల కానున్న జనక అయితే గనక
- సుహాస్ ఆశలన్నీ ఈ సినిమాపైనే
- కమర్షియల్ బ్రేక్ కోసం సుహాస్ ఎదురుచూపు
పడి పడి లేచే మనసు చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన నటుడు సుహాస్ 'కలర్ ఫోటో' చిత్రంతో హీరోగా మారాడు. ఈ చిత్రం నేరుగా ఆహా ఓటీటీలో విడుదలైంది. ఈ చిత్రంతో హీరోగా గుర్తింపు పొందిన సుహాస్ ఆ తరువాత రైటర్ పద్మభూషణ్, అంబాజీ పేట మ్యారేజి బ్యాండు, శ్రీరంగ నీతులు, ప్రసన్నవదనం చిత్రాల్లో కథానాయకుడిగా చేశాడు. అయితే సుహాస్ నటించిన ప్రతి చిత్రం పాజిటివ్ టాక్‌నే సొంతం చేసుకున్నా బాక్సాఫీస్ వద్ద అనుకున్న వసూళ్లు రాలేదు.
అంబాజీపేట మ్యారేజి బ్యాండు, ప్రసన్న వదనం చిత్రాలు కూడా మంచి టాక్‌తో పాటు సుహాస్ నటనకు కూడా మంచి మార్కులే పడ్డా వసూళ్ల పరంగా నిరాశపరిచాయి. తాజాగా ఈ చిత్రాల కథానాయకుడు హీరోగా చేసిన మరో చిత్రం 'జనక అయితే గనక'. ఈ చిత్రంలో ఇతను ఓ మధ్య తరగతి యువకుడిగా కనిపిస్తాడు. పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నా పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. తన సంపాదనతో పిల్లలను పెంచడం సాధ్యం కాదనే మైండ్‌సెట్‌తో వుండే యువకుడి బాధలను పూర్తి వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు సందీప్ బండ్ల. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అక్టోబర్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
దసరా సెలవుల్లో, విజయదశమికి వస్తున్న ఈ చిత్రంపై నిర్మాత దిల్ రాజుతో పాటు హీరో సుహాస్ కూడా బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. తనను ఎన్నాళ్ల నుంచో ఊరిస్తున్న బాక్సాఫీస్ విజయం ఈ చిత్రంతో వస్తుందని సుహాస్ అంచనా వేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లాంటి పెద్ద బ్యానర్లో చేసిన ఈ సినిమా విజయదశమికి మంచి సీజన్లో కూడా రిలీజ్ అవుతుండటంతో తప్పనిసరిగా ఈచిత్రం తనకు హీరోగా బ్రేక్‌నిస్తుందని సుహాస్ నమ్మకంతో వున్నాడు. అంతేకాదు ఈ చిత్రంతో సుహాస్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్‌గా మారాడు. పెద్ద బ్యానర్‌తో పాటు సీజన్ కూడా కలిసి వస్తున్న ఈ చిత్రం తప్పనిసరిగా బాక్సాఫీస్ వద్ద కూడా పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తున్నారు మేకర్స్.