new liquor policy: ఏపీలో దసరా పండుగ కంటే ముందే కొత్త మద్యం పాలసీ

ap govt released notification on new liquor policy
  • ఏపీలో 3,396 ప్రైవేటు మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
  • నేటి నుంచి నూతన మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ
  • అక్టోబర్ 11న డ్రా పద్దతిన షాపుల కేటాయింపు
  • అక్టోబర్ 12 నుండి రాష్ట్రంలో కొత్త మద్యం షాపుల ద్వారా విక్రయాలు
ఏపీలో మందు బాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దసరా పండుగకు ముందే ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మీడియాకు తెలిపారు. గత ప్రభుత్వం మద్యం పాలసీ ద్వారా భారీ ఎత్తున దోపిడీకి పాల్పడిందని ఆరోపించిన మంత్రి రవీంద్ర.. ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేటు వైస్ షాప్స్ నిర్వహణ జరిగేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీని ప్రభుత్వం ఖరారు చేసింది.

ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకూ ఈ విధానం అమల్లో ఉండనుంది. మొత్తం 3,396 మద్యం షాపుల లైసెన్స్ ల జారీకి సోమవారం అర్ధరాత్రి తర్వాత ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మంగళవారం (అక్టోబర్ 1,ఈరోజు) నుంచే దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మద్యం షాపులు నిర్వహించాలనుకునే వారు అన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ధరఖాస్తులు చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు. అయితే ఒక్కో దరఖాస్తునకు రూ.2 లక్షల చొప్పున నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 11న జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ తీసి, లైసెన్సులు కేటాయించనున్నారు. ఈ నెల 12వ తేదీ నుండి లైసెన్సుదారులు కొత్త షాపులను ప్రారంభించి అమ్మకాలు చేపడతారు. 

జనాభా ప్రాతిపదికన మొత్తం నాలుగు శ్లాబుల్లో లైసెన్సులు ఖరారు చేయనున్నారు. లైసెన్సు రుసుమును ఆరు వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వంలో మద్యంపై పది రకాల పన్నులు విధించగా, నూతన మద్యం విధానంలో వాటిని ఆరుకు కుదించారు. మద్యం ధరలను తగ్గిస్తూ రూ.99లకే క్వార్టర్ లభించేలా ఎంఆర్పీలు నిర్ణయించారు. కాగా, ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికుల విభాగంలోకి వచ్చే ఆరు కులాలకు 340 మద్యం షాపులను కేటాయించనున్నారు. ఈ రిజర్వుడ్ షాపులకు సంబంధించి పాలసీని రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం విడుదల చేయనుంది.
 
ఈ నగరాల్లో 12 ప్రీమియం స్టోర్లు          
ప్రస్తుతం ప్రభుత్వం నోటిఫై చేసిన 3,396 లిక్కర్ షాపులకు అదనంగా మరో 12 ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురంలో వీటి ఏర్పాటునకు అవకాశం కల్పించారు. ఈ దుకాణాలకు అయిదేళ్ల కాలపరిమితి ఉంటుంది. లైసెన్సు రుసుము ఏడాదికి రూ.కోటి గా నిర్ణయించారు. అయితే వీటికి సంబంధించి విధివిధానాలను విడిగా ఖరారు చేయనున్నారు.
new liquor policy
ap govt
Liquor shops notification

More Telugu News