Musi River: మూసీ నది ఒడ్డున మొదలైన కూల్చివేతలు
- స్వచ్ఛందంగా ఖాళీ చేసిన వారి ఇళ్లను కూల్చేస్తున్న అధికారులు
- బుల్డోజర్లు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కూలీల ఏర్పాటు
- నిర్వాసితులను తరలించేందుకు వాహనాలు సమకూర్చిన సిబ్బంది
మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నదీపరీవాహక ప్రాంతంలోని ఇళ్లను మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ కూల్చివేస్తోంది. శంకర్ నగర్ లో అధికారులు మంగళవారం ఉదయం కూల్చివేతలు చేపట్టారు. స్వచ్ఛందంగా ఖాళీ చేసిన వారి ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు. ఇరుకు సందులు కావడంతో బుల్డోజర్లు వెళ్లే పరిస్థితి లేక కూలీలను పెట్టి పనికానిస్తున్నారు. నిర్వాసితులను ఇప్పటికే చంచల్‌గూడ డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయానికి తరలించారు. మరికొంతమంది నిర్వాసితులను తరలించేందుకు, ఇళ్లల్లోని సామగ్రి తీసుకెళ్లేందుకు అధికారులు వాహనాలను ఏర్పాటు చేశారు.
మూసీ సుందరీకరణ పనుల్లో భాగంగా రివర్ బెడ్ పరిధిలో సుమారు 55 కి.మీ పరిధిలో 40 వేల ఆక్రమణలను కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. చాదర్‌ఘాట్ మూసీ పరీవాహక ప్రాంతాల్లోని మూసానగర్, రసూల్‌పుర, వినాయక్‌నగర్ పరిసరాల్లో ఇళ్లకు రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేశారు. ఇందులో ప్రస్తుతం స్వచ్ఛందంగా ఖాళీ చేసిన వారి ఇళ్ల కూల్చివేతను ప్రారంభించారు.