Campa Cola: కోకా కోలా, పెప్సీకి ముకేశ్ అంబానీ భారీ షాక్.. కాంపాకోలా ధరల తగ్గింపు.. ఈ డ్రింక్ వెనక ఇంత కథ ఉందా?
- 1970-80లలో ఇండియన్స్ ఫేవరెట్ డ్రింక్‌గా కాంపాకోలా
- ఆ తర్వాత విదేశీ బ్రాండ్ల రాకతో తగ్గిన ప్రాభవం
- ఇటీవల మళ్లీ ఈ బ్రాండ్‌ను తీసుకొచ్చిన రిలయన్స్
- పండుగ సీజన్ వేళ ధరల తగ్గింపు
- కోకాకోలా, పెప్సీ కంటే సగం ధరకే కాంపాకోలా
పండుగ సీజన్ వేళ ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ కన్జుమర్ ప్రొడక్ట్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. సాఫ్ట్‌డ్రింక్ కాంపాకోలా ధరలను తగ్గించింది. దీంతో ఇప్పుడీ పానీయం కోకాకోలా, పెప్సీ ధరలతో పోలిస్తే సగం ధరకే లభించనుంది. 1970, 80లలో పాప్యులర్ బ్రాండ్ అయిన కాంపాకోలాను అద్భుతమైన రుచితో వినియోగదారులను కట్టిపడేసింది.
అయితే, ఆ తర్వాత దేశంలో విదేశీ డ్రింకుల హవా పెరగడంతో కాంపాకోలా అమ్మకాలు పడిపోయి దాని ప్రాభవం తగ్గింది. రిలయన్స్ మళ్లీ ఇటీవల ఈ బ్రాండ్‌ను తిరిగి ప్రారంభించింది. భారత మార్కెట్లో ప్రస్తుతం కోకాకోలా 51 శాతం వాటా కలిగి ఉండగా, పెప్సీ 34 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది.
1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వంలో జార్జ్ ఫెర్నాండెజ్ పరిశ్రమల మంత్రిగా నియమితులయ్యారు. ఆ వెంటనే ఆయన గొప్ప నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కోకాకోలా ఉత్పత్తిని నిలిపివేశారు. భారత్‌లోని విదేశీ కంపెనీలకు నోటీసులు జారీచేస్తూ ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ చట్టం (ఫెరా)కు కట్టుబడి ఉండాలని ఆదేశించారు.
ఆ సమయంలో సర్దార్ మోహన్ సింగ్ కంపెనీ ‘ప్యూర్ డ్రింక్స్’ కోకాకోలా ఉత్పత్తులతో గణనీయమైన లాభాలు ఆర్జించింది. 1949 నుంచి 1970 వరకు భారత్‌లో కోకాకోలాను ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ మాత్రమే విక్రయించేది. జనతా పార్టీ నిర్ణయం తర్వాత కోకా కోలా స్థానంలో కాంపాకోలాను ప్యూర్ డ్రింక్స్ ప్రారంభించింది. కోకాకోలా ఉత్పత్తులు నిలిచిపోవడంతో ప్రభుత్వం ‘డబుల్ సెవన్’ పేరుతో సాఫ్ట్‌డ్రింక్‌ను పరిచయం చేసింది. దీనికి ‘డబుల్ సెవెన్’ అని పేరు పెట్టడం వెనక కూడా ఓ కారణం ఉంది. 1977లో జనతా పార్టీ అధికారంలోకి రావడంతో దీనికి ‘77’ అని పేరు పెట్టారు. దీనిని మైసూర్‌లోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసింది. ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఇది ప్రజల అభిమానాన్ని పొందలేకపోయింది. దీంతో కాంపా కోలా నేరుగా లబ్ధి పొంది ఇండియన్స్ ఫేవరెట్ డ్రింక్‌గా మారింది.