KTR: కేటీఆర్ ను అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు.. గోబ్యాక్ అంటూ నినాదాలు
- ముషీరాబాద్ వద్ద కేటీఆర్ ను అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు
- కొండా సురేఖపై ట్రోలింగ్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్
- పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. ముషీరాబాద్ వద్ద ఆయనను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. గోబ్యాక్ కేటీఆర్ అంటూ నినాదాలు చేశాయి. మూసీ నది పరీవాహక ప్రాంత నివాసితులకు భరోసా కల్పించేందుకు ఆయన వెళుతుండగా... ముషీరాబాద్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
మూసీ నది రివర్ బెడ్ పరిధిలో ఉన్న నివాసాల కూల్చివేతలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. ఖాళీ చేసిన ఇళ్లను అధికారులు కూల్చి వేస్తున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. కూల్చివేతలను పరిశీలించేందుకు, బాధితులకు భరోసా కల్పించేందుకు బీఆర్ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ చాదర్ ఘాట్ కు బయల్దేరారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు ముషీరాబాద్ వద్ద కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్నాయి. కొందరు కేటీఆర్ ప్రయాణిస్తున్న వాహనంపైకి కూడా ఎక్కారు.
మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు బాధ్యత వహిస్తూ కేటీఆర్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. కేటీఆర్ కాన్వాయ్ ను ముందుకు పంపించారు.