India vs Bangladesh: కాన్పూర్ టెస్టులో భారత్ ఘన విజయం... సిరీస్ క్లీన్‌స్వీప్
- కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్, భారత్ రెండో టెస్టు
- 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం
- మరోసారి అర్ధ శతకంతో రాణించిన జైస్వాల్
- టీమిండియా 2-0తో సిరీస్ కైవసం
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 95 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని రోహిత్ సేన సులువుగా ఛేదించింది. మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది.
భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి అర్ధ శతకం (51)తో రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కూడా బ్యాట్ ఝుళిపించిన యువ బ్యాటర్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అద్భుతంగా ఆడాడు. 45 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 51 పరుగులు చేసి ఔటయ్యాడు.
రోహిత్(8), శుభ్‌మన్ గిల్ (6) త్వరగానే పెవిలియన్ చేరినా.. మిగతా పనిని విరాట్ కోహ్లీ (29 నాటౌట్) చివరి వరకు క్రీజులో ఉండి పూర్తి చేశాడు. 17.2 ఓవర్లలో భారత్ 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ మిరాజ్ 2, ఇస్లాం ఒక వికెట్ తీశారు.
ఇక ఈ మ్యాచ్ విజయంతో భారత జట్టు రెండు మ్యాచ్ ల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. ఒకవేళ కాన్పూర్ టెస్ట్ డ్రాగా ముగిస్తే మాత్రం డబ్ల్యూటీసీలో ఫైనల్‌కు చేరాలంటే సమీకరణాలు భారత్‌కు సంక్లిష్టంగా మారేవి.
* బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 233, రెండో ఇన్నింగ్స్: 146
* భారత్ తొలి ఇన్నింగ్స్: 285/9 డిక్లేర్, రెండో ఇన్నింగ్స్: 98/3