Police Canstables: గతంలో నిలిచిన కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ పై హోంమంత్రి అనిత ప్రకటన... ఇది సంతోషకరమైన వార్త అంటూ మంత్రి లోకేశ్ స్పందన

AP govt will restart Police Canstables Recruitment
  • 2022లో... 6,100 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్
  • ప్రిలిమ్స్ నిర్వహించి రిజల్ట్స్ కూడా వెల్లడించిన ప్రభుత్వం
  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో నిలిచిన రిక్రూట్ మెంట్
  • ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో రిక్రూట్ మెంట్ కొనసాగింపు
ఏపీలో ఏడాదిన్నర క్రితం నిలిచిపోయిన కానిస్టేబుల్ నియామకాలను కూటమి ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కించింది. దీనిపై ఏపీ హోంమంత్రి అనిత మాట్లాడారు. 6,100 కానిస్టేబుల్ పోస్టుల నియామకంలో తదుపరి పరీక్షలను ప్రారంభిస్తున్నామని... 5 నెలల్లో శారీరక సామర్థ్య పరీక్షలు పూర్తి చేస్తామని చెప్పారు. slprb.ap.gov.in వెబ్ సైట్ లో పూర్తి వివరాలు ఉంటాయని వెల్లడించారు. 

గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా కానిస్టేబుల్ నియామక ప్రక్రియ వాయిదా పడింది. గత వైసీపీ ప్రభుత్వం 2022లో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ప్రిలిమ్స్ నిర్వహించి, ఫలితాలు సైతం వెల్లడించారు. 

2023 జనవరిలో ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించగా... 95,208 మంది ఉత్తీర్ణులయ్యారు.  అయితే ఆ తర్వాత నిర్వహించాల్సిన పీఎంటీ, పీఈటీ దశలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వల్ల బ్రేక్ పడింది.

కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్: మంత్రి నారా లోకేశ్

కాగా, కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ ప్రక్రియ మళ్లీ ప్రారంభిస్తామని హోంమంత్రి అనిత ప్రకటించడంపై ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన ప్రకటన విడుదల చేశారు.

"అర్ధాంత‌రంగా నిలిపివేసిన కానిస్టేబుల్ నియామక పరీక్ష ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తున్నామని ప్ర‌క‌టించిన‌ హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత గారికి ధ‌న్య‌వాదాలు. ప్రిలిమిన‌రీ ప‌రీక్ష త‌రువాత రిక్రూట్ మెంట్ రెండవ దశలో జ‌ర‌గాల్సిన‌ శారీరక దారుఢ్య పరీక్షలు వేర్వేరు కారణాల‌తో వాయిదా ప‌డ‌టం వ‌ల్ల తాము ప‌డుతున్న ఇబ్బందుల‌ను `ప్ర‌జాద‌ర్భార్‌`కు వ‌చ్చిన నిరుద్యోగులు నా దృష్టికి తీసుకొచ్చారు. వీరి విన‌తిని ప‌రిశీలించాల‌ని హోం మంత్రి గారికి పంప‌గా, వారు సానుకూలంగా స్పందించి రిక్రూట్ మెంట్ ప్ర‌క్రియ‌లో త‌రువాత ద‌శ‌లు ప్రారంభిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇది కానిస్టేబుల్ అర్హ‌త ప‌రీక్ష పాసైన నిరుద్యోగుల‌కు చాలా సంతోష‌క‌ర‌మైన స‌మాచారం" అని నారా లోకేశ్ ప్రకటించారు.


Police Canstables
Recruitment
Vangalapudi Anitha
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News