Axis Bank: తుపాకితో బ్యాంకులోకి.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి రూ. 40 లక్షల దోపిడీ.. వీడియో ఇదిగో!
- ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో యాక్సిస్ బ్యాంకులో ఘటన
- తుపాకితో మేనేజర్ రూములోకి ప్రవేశించి రూ. 40 లక్షలు కావాలని బెదిరింపు
- అడిగినంత ఇవ్వకుంటే చంపడమో, చావడమో జరుగుతుందని హెచ్చరిక
- దుండగుడి కోసం గాలిస్తున్న పోలీసులు
తుపాకితో బ్యాంకులోకి ప్రవేశించిన దుండగుడు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి రూ. 40 లక్షలు దోచుకుని పరారయ్యాడు. ఉత్తరప్రదేశ్ షామ్లీ జిల్లాలోని యాక్సిస్ బ్యాంకు బ్రాంచ్‌లో జరిగిందీ ఘటన. ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఎక్స్ ద్వారా స్పందించారు. దుండగుడి పిస్తోలు చూసి బ్యాంకు సెక్యూరిటీ సిబ్బంది తుపాకి వణికిపోయిందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు దోపిడీ వీడియోను షేర్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ పాలనలో బహిరంగంగా రూ. 40 లక్షలు దోచుకుపోయాడని, ఇది నిజమని, రాష్ట్రంలో శాంతిభద్రతలు ఇలా ఉన్నాయన్నది కూడా నిజమని పేర్కొన్నారు.
యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ నవీన్ జైన్ మాట్లాడుతూ ముసుగేసుకున్న దుండగుడు తన క్యాబిన్లోకి ప్రవేశించి తుపాకితో బెదిరించాడని పేర్కొన్నారు. రూ. 40 లక్షలు ఇవ్వకుంటే చంపేస్తానని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని పోలీసులకు చెప్పాడు. ఆ డబ్బుతో తాను లోను చెల్లించాలని చెప్పాడని పేర్కొన్నారు. క్యాషియర్ రోహిత్‌కు చెప్పి రూ. 40 లక్షలు తెప్పించి ఇస్తే బైక్‌పై పారిపోయాడని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు బ్యాంకుకు చేరుకుని సీసీటీవీ ఫుటేజీ సేకరించారు. బ్యాంకు సిబ్బందిని ప్రశ్నించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.