Jagga Reddy: కొండా సురేఖను రెచ్చగొట్టి మీరే తన్నించుకున్నారు: కేటీఆర్‌పై జగ్గారెడ్డి ఆగ్రహం
- కొండా సురేఖతో కొట్లాడటం అంత సులభం కాదన్న జగ్గారెడ్డి
- సోషల్ మీడియాను కంట్రోల్ చేయకపోవడం బీఆర్ఎస్ తప్పేనని వ్యాఖ్య
- కొండా సురేఖ విషయంలో పుండు మీద కారం చల్లినట్లు కేటీఆర్ మాట్లాడారని విమర్శ
ఇంట్లో ఉన్న కొండా సురేఖను రెచ్చగొట్టి మీరే తన్నించుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. కొండా సురేఖతో కొట్లాడటం అంత సులభం కాదన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ విషయంలో పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ పెద్దరికంగా వ్యవహారించాల్సి ఉండాల్సిందని అన్నారు. పార్టీకి చెందిన సోషల్ మీడియాను కంట్రోల్ చేయకపోవడం తప్పే అన్నారు.
ఆ తర్వాత పుండు మీద కారం చల్లినట్లు కేటీఆర్ మాట్లాడారని విమర్శించారు. అసలే మంత్రి (కొండా సురేఖ) ఫైర్ బ్రాండ్.. ఆమెను ఏమీ అనకుంటే ఎవరినీ ఏమీ అనబోరని పేర్కొన్నారు. ఈ విషయం తెలిసి కూడా ఆమె జోలికి ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్కు కొంచెం కూడా పరిజ్ఞానం లేకపోవడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు పదేళ్లు రాజభోగాలు అనుభవించారన్నారు.
కేటీఆర్ మరో పదేళ్లు ఓపిక పడితే పరిపూర్ణత చెందిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవచ్చని సూచించారు. రాజకీయ పరిపూర్ణతలేని నాయకుడిగా మిగలవద్దని హితవు పలికారు. కొండా సురేఖకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆరే ముందు తప్పు చేశారన్నారు. కొండా సురేఖ విమర్శలు చేసే అవకాశాన్ని ఆయనే ఇచ్చారన్నారు.
రాహుల్ గాంధీపై కూడా కేటీఆర్ నిందలు వేయడం సరికాదన్నారు. 52 ఏళ్లు దేశాన్ని పాలించిన గాంధీ కుటుంబం గురించి ప్రజలకు బాగా తెలుసన్నారు. వాళ్ళ ఆస్తులు ప్రభుత్వ భవనాలేనని చెప్పారు. పనికి మాలిన మాటలు మాట్లాడితే ఖబడ్దార్ అని హెచ్చరించారు. రాహుల్ గాంధీపై అభాండాలు వేస్తే ఊరుకునేది లేదన్నారు.